Friday, November 22, 2024

టాటాల చేతికి బిస్లరీ.. డీల్‌ విలువ 7 వేల కోట్లు

ప్రముఖ ప్యాకేజ్డ్‌ వాటర్‌ సంస్థ బిస్లరీని విక్రయించనున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ రమేష్‌ చౌహాన్‌ తెలిపారు. టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ లిమిటెడ్‌తో ఆయన చర్చలు జరిపారు. దీనిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. టాటా గ్రూప్‌ అనుసరిస్తున్న వ్యాపార విధానాలు, పాటిస్తున్న విలువలు తనను ఆకర్షించాయని చెప్పారు. బిస్లరీని టాటా గ్రూప్‌ ఏడు వేల కోట్లకు కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తన కుమార్తె జయంతి వ్యాపారం పై ఆసక్తి చూపించడంలేదని , అందుకే బిస్లరీని అమ్మకానికి పెట్టినట్లు రమేష్‌ చౌహాన్‌ చెప్పారు. ప్రస్తుతం బిస్లరీ బ్రాండ్‌ దేశంలో అగ్రగామిగా ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకోవడానికి టాటా గ్రూప్‌ సరైనదిగా ఆయన భావిస్తున్నారు. టాటా గ్రూప్‌కు ఇప్పటికే ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బిజినెస్‌ ఉంది.

రమేష్‌ చౌహాన్‌ 1993లో థమ్సప్‌, గోల్డ్‌ స్పాట్‌, సిట్రా, మజా, లిమ్క్‌ బ్రాండ్లను కోకా-కోలాకు విక్రయించారు. ఇందులో థమ్సప్‌ ఇప్పటికే బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా ఎదిగింది. 2024 నాటికి మాజా కూడా ఈ మైలురాయిని అధిగమిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. 2016లో బిస్లరీ ద్వారా చౌహాన్‌ తిరిగి సాఫ్ట్‌ డ్రింక్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంపై దృష్టి పెట్టిన టాటా గ్రూప్‌ ఇటీవల ఈ రంగంలోని పలు బ్రాండ్లను కొనుగోలు చేసింది. టాటా గ్రూప్‌ హిమాలయన్‌ బ్రాండ్‌ పేరుతో ప్యాకేజ్డ్‌ వాటర్‌ రంగంలో ఉంది. దీంతో పాటు కాపర్‌ ప్లస్‌, టాటా గ్లూకో పేరుతో హైడ్రేషన్‌ సెగ్మెంట్‌లోనూ టాటా గ్రూప్‌ ప్రవేశించింది. బిస్లరీ కొనుగోలుతో డ్రింకింగ్‌ వ్యాపారంలో మరింత మార్కెట్‌ వాటాను సాధించాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది.

- Advertisement -

బిస్లరీ ఈ ఆర్ధిక సంవత్సరంలో 2,500 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 220 కోట్ల నికర లభాన్ని సాధించింది. వాస్తవానికి బిస్లరీ ఇటాలియన్‌ బ్రాండ్‌. 1965లో ముంబైలో బిస్లరీ తన మొదటి షాపును ప్రారంభించింది. 1969లో రమేష్‌ చౌహాన్‌ బిస్లరీని కనుగోలు చేశారు. ప్రస్తుతం బిస్లరీకి దేశవ్యాప్తంగా 122 ఆపరేషనల్‌ ప్లాంట్లు ఉన్నాయి. 4,500 మంది డిస్టిబ్యూటర్లు ఉన్నారు. 5 వేల ట్రక్కులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement