తిరువనంతపురం : కేరళలో తాజాగా బర్డ్ ఫ్లూ కలకం సృష్టిస్తోంది. అలప్పూజ జిల్లాలోని తకాళి పంచాయతీ పరిధిలో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ఇది మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను అక్కడున్న 10వ వార్డు చుట్టూ ఒక కి.మీ పరిధిలో బాతులు, కోళ్లు, ఇతర పెంపుడు పక్షులను చంపాలని నిర్ణయించారు. ఇందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ అనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. స్థానికంగా పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్ పశుసంవర్ధక, ఆరోగ్య, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.
బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు.. ఆ ప్రాంతంలో వాహనాలు, ప్రజల రాకపోకలపై కట్టడి విధించారు. బాతులు, కోళ్లు, పక్షుల గుడ్లు, మాంసం వినియోగం, అమ్మకాలను నిషేధం విధించారు. కేరళలోని హరిప్పడ్ మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల దాదాపు 12 పంచాయతీల్లోనూ ఈ నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. మరోవైపు వలస పక్షులకు వైరస్ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు.