Thursday, November 21, 2024

ఇక ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లోనూ బయోమెట్రిక్‌! తప్పుడు వివరాలకు అడ్డుకట్ట

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఫీజులను ముక్కు పిండి వసూలు చేసే ప్రైవేట్‌ కాలేజీలు అరకొర వసతులు, స్టాఫ్‌తో సరిపెట్టుకుంటూ ఇంటర్‌ బోర్డు గుర్తింపు లేకుండానే నడిపిస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసే కొన్ని కాలేజీలు ఏమాత్రం అనుభవం లేని అధ్యాపకులతో విద్యార్థులకు బోధిస్తున్నారు. అడ్మిషన్‌ తీసుకునే సమయంలో సీనియర్‌ ఫ్యాకల్టి ఉన్నారని చెప్పి… జూనియర్‌ ఫ్యాకల్టిలతో పాఠ్యాంశాలు బోధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అధ్యాపకులను ఒక బ్రాంచ్‌లో రిక్రూట్‌ చేసుకొని వేరోక బ్రాంచ్‌కు పంపించి అక్కడ పాఠ్యాంశాలనూ బోధిస్తున్నారనే ఆరోణలు పలు విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి. దీంతోపాటు ఒక మెయిన్‌ బ్రాంచ్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థికి ఇతర క్యాంపస్‌లో కూర్చోబెడుతున్నారు. ఇలా ఒకట్రెండు రోజులైతే పర్వాలేదు కానీ, ఏడాది పొడవునా ఇదే తంతు నడుస్తోంది. ఇటీవల నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి ఆ బ్రాంచ్‌లో అసలు అడ్మిషనే లేదని ఇంటర్‌ బోర్డు అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో తేలిన విషయం తెలిసిందే. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్‌ బోర్డు ప్రత్యేక దృష్టి సారించబోతోంది.

ఎవరు ఎక్కడ అడ్మిషన్‌ తీసుకున్నారో? ఏ కాలేజీలో స్టాఫ్‌ ఎంత మంది ఉన్నారో పక్కా వివరాలు ఉండడంలేదని ఇంటర్‌ బోర్డు దృష్టికి వచ్చింది. ఈక్రమంలోనే ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో బయోమెట్రిక్‌ అమలు చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అందుబాటులోకి తేవాలని ఉన్నతాధికారులు అనుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అమలులో ఉన్న బయోమెట్రిక్‌ విధానాన్ని ఇక నుంచి ప్రైవేట్‌, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీల్లోనూ పక్కాగా అమలు చేసేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇంటర్‌ పరీక్షలు ఇటీవలే ముగియడంతో జవాబు పత్రాల మూల్యాంకనంపై ఇంటర్‌బోర్డు అధికారులు ప్రస్తుతం దృష్టి సారించారు. మరోవైపు కొత్త ఏడాదికి గానూ కాలేజీల అఫిలియేషన్‌ కోసం ఇంటర్‌ బోర్డు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఫైన్‌ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఫిబ్రవరి 21తోనే ముగియగా, రూ.20 వేల ఫైన్‌తో ఈనెల 31 వరకు ఉంది.

ఇప్పటికే చాలా కాలేజీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఏప్రిల్‌ 30 లోపు అఫిలియేషన్‌ కాలేజీల లిస్టును ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. అయితే కాలేజీలకు అఫిలియేషన్‌ ఇచ్చిన తర్వాత, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అన్ని కాలేజీలు తప్పకుండా బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని ఇంటర్‌ బోర్డు ఆదేశాలను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అధ్యాపకుల వివరాలు, విద్యార్థుల వివరాలు, ఇతర సిబ్బంది వివరాలు, గుర్తింపు వివరాలు పక్కాగా చూపించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ కాలేజీల వివరాలను ఎప్పటికప్పుడు ఇంటర్‌ బోర్డు పరిశీలించి అక్రమాలకు అడ్డుకట్ట వేయనుంది. 2022-23 విద్యాసంవత్సరానికి మొత్తం రాష్ట్రంలో 1856 కాలేజీలు ఇంటర్‌ బోర్డు నుంచి గుర్తింపును పొందాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఈ అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌ విధానం పక్కాగా అమలు చేసే విధంగా ఇంటర్‌ బోర్డు త్వరలోనే ఆదేశాలను జారీ చేయనుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నాలుగేళ్ల క్రితమే బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుకు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement