న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం అధికారుల నియామకంపై కొత్త బిల్లు ను లోక్‌సభలో ఆమోదించారు. ఆ బిల్లు ప్రకారం నూతన చీఫ్ ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను నియమించనున్నారు. అయితే ఎన్నికల అధికారుల బిల్లుకు రాజ్యసభ గతంలోనే ఆమోదం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారుల నియామకం, సర్వీస్ పరిమితులు, ఆఫీసు కాల పరిమితి గురించి కొత్త బిల్లులో పొందుపరిచారు.
తాజాగా ఎలక్షన్ ఆఫీసర్ల నియామకంపై పార్లమెంట్‌లో బిల్లు క్లియర్ కావడంతో ఇప్పుడు ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనున్నది. బిల్లు గురించి లోక్‌సభలో చర్చ జరిగింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనిపై మాట్లాడారు. 1991లో రూపొందించిన ఎన్నికల అధికారుల నియామకం బిల్లు అస్పష్టంగా ఉందని, ఆ బిల్లులోని లోపాలను తాజా బిల్లులో పూర్తి చేసినట్లు చెప్పారు. మూజవాణి ఓటు ద్వారా తాజా బిల్లును ఆమోదించారు.