Wednesday, November 20, 2024

Delhi | బిల్లు మహిళలకు కానుక.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు దేశంలోని మహిళలకు అందించిన కానుకగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ అభివర్ణించారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామంటే విపక్ష రాజకీయ పార్టీలు హేళన చేశాయని, కానీ ఈ ప్రత్యేక సమావేశాలు చరిత్ర పేజీల్లో సువర్ణాక్షరాలతో లిఖించేలా నిలిచిపోతాయని అన్నారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని ప్రధాని కోరారని, పార్టీలకు అతీతంగా అందరూ మద్దతిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు నవభారత నిర్మాణంలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో అనేక పథకాలు తీసుకొచ్చారని డా. లక్ష్మణ్ అన్నారు.

అయితే విపక్ష నేత మల్లికార్జున ఖర్గే బిల్లును నీరుగార్చేలా ఎందుకు మాట్లాడారో మహిళలు అర్థం చేసుకోవాలని అన్నారు. మహిళా బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) మహిళా బిల్లు కావాలంటూ తీర్మానం చేసి, ఆ నిర్ణయాన్ని సొంత పార్టీలో మాత్రం అమలు చేయడం లేదని అన్నారు.

- Advertisement -

మొక్కుబడిగా మహిళల ఓట్ల కోసం, వారి మెప్పు కోసం తూతూ మంత్రంగా చేసిన తీర్మానం మాత్రమేనని అన్నారు. మహిళా రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తన సొంత పార్టీలో మహిళలకు ప్రాధాన్యత కల్పించకపోవడంపై మాత్రం ప్రశ్నించడం లేదని తెలిపారు. ఈ బిల్లు పాసైన మరుక్షణం నుంచే అమలైతే అంతకంటే ఇంకేం కావాలని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement