ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన 27 ఏళ్ల వివాహ బంధాన్ని చెక్ పెడుతున్నారు. తాను, మెలిందా ఇద్దరం విడాకులు తీసుకోబోతున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు. పలుమార్లు ఆలోచించి, ఎంతో మథనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నామని, ఈ కాలంలో ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తాము విడిపోయినప్పటికీ బిల్‌మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ కొనసాగుతుందని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా తమ ఫౌండేషన్ కృషి చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని భావించిన తాము కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని, తమ నిర్ణయాన్ని, వ్యక్తిగత ఆకాంక్షలను గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు గేట్స్, మెలిందాలు పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి బిల్‌గేట్స్ సీఈవోగా ఉన్న సమయంలో 1987లో మెలిందా ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరారు. ఇద్దరూ తొలిసారిగా న్యూయర్క్ నగరంలో జరిగిన విందు కార్యక్రమంలో కలుసుకోగా.. ఆ తర్వాత 1 జనవరి, 1994లో హవాయిలో వీరిద్దరి పెళ్లి జరిగింది. బిల్, మెలిందా దంపతులకు జెన్నిఫర్ కాథరిన్ గేట్స్, రోరిజాన్ గేట్స్, ఫోబ్ అడిలె గేట్స్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్ ఒకరు.