Wednesday, November 20, 2024

చైనా అధ్య‌క్షుడు షి జిన్ పింగ్ తో బిల్ గేట్స్ భేటి..

బీజింగ్ – ప్రపంచ బిలియ‌నీర్ బిల్‌ గేట్స్ తో చైనా అధినేత షీజిన్‌పింగ్ భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత ఓ విదేశీ వ్యాపారవేత్తతో జిన్‌పింగ్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. దాదాపు మూడేళ్ల నుంచి జిన్‌పింగ్‌ విదేశీ పర్యటనలను నిలిపివేశారు. 2019 తర్వాత బిల్‌గేట్స్‌ తొలిసారి బీజింగ్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చైనా అధినేత షీ జిన్ పింగ్ మాట్లాడుతూ ”ఈ ఏడాది నేను బీజింగ్‌లో కలిసిన తొలి అమెరికన్‌ మిత్రులు మీరే. మేము ఎల్లప్పుడూ అమెరికన్‌ ప్రజలపై ఆశలు పెట్టుకొంటాం. ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే బిల్‌గేట్స్‌ తన పర్యటనలో భాగంగా నేడు గ్లోబల్‌ హెల్త్‌ డ్రగ్‌ డిస్కవరి ఇన్‌స్టిట్యూట్‌లో ప్రపంచ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సాంకేతికత వినియోగంపై ప్రసంగించారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను బీజింగ్‌ స్థానిక ప్రభుత్వ, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కలిసి సింగ్వా విశ్వవిద్యాలయం సహకారంతో ఏర్పాటు చేశాయి. ఇక్కడ కొత్త ఔషధాలు కనుగొనేందుకు వీలుగా చెరో 50 మిలియన్‌ డాలర్లు కేటాయించాయి. ఈ నిధులతో మలేరియా, క్షయలతో పోరాడేందుకు చైనాకు సహకరించనున్నారు. ఈ సందర్భంగా గేట్స్‌ ఫౌండేషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ”ప్రపంచ వ్యాప్తంగా పేదలకు సోకే మలేరియా, క్షయ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడేందుకు అవసరమైన చికిత్సలను మెరుగుచేస్తారని ఆశిస్తున్నాం” అని పేర్కొంది. అలాగే చైన అధ్య‌క్షుడుతో స‌మావేశం సంతృప్తి ఇచ్చింద‌ని బిల్ గేట్స్ ప్ర‌క‌టించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement