పట్నా: బిహార్ లోని కటిహార్ జిల్లాలో కరెంట్ కోతలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. కటిహార్‌లోని బార్సోయి ప్రాంతంలో కరెంట్ కోతలు, విద్యుత్ టారిఫ్ లను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. స్థానిక విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీసుపైకి రాళ్లు విసిరి అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు పోలీసులు తొలుత లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.