బీహార్ మాజీ విద్యాశాఖ మంత్రి, అధికార జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరీ కరోనాతో కన్నుమూశారు. గతవారం కరోనాబారిన పడిన మేవాలాల్ పాట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మృతిచెందారు. ఆయన ప్రస్తుతం తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం తర్వాత సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో నెలరోజుల వ్యవధిలోనే మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి మృతిపట్ల సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రాజకీయాల్లో, విద్యారంగంలో ఆయన లేని లోటును పూడ్చలేమని విచారం వ్యక్తంచేశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.