పాట్నా: బీహార్ రాష్ట్రానికి ఆయనో ముఖ్యమంత్రి. ఆయన గంజాయి సేవిస్తూ ఉంటారు. కొన్నేళ్ల నుంచి గంజాయి సేవిస్తున్నారని ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ సీనియర్ ఎమ్మెల్యే రాజవంశీ మహతో సంచలన ఆరోపణలు చేశారు. నేటికి నితీష్ ఆ వ్యసనాన్ని వదులుకోలేదని తెలిపారు. గంజాయి కూడా మత్తుపదార్థం కిందకే వస్తుంది. ప్రస్తుతం బీహార్ లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. ఆ రాష్ట్ర ప్రజలందరి చేత మద్యపానానికి వ్యతిరేకంగా సీఎం నితీష్ కుమార్ సామూహిక ప్రతిజ్ఞ చేయించారు.
ఆయన మాత్రం ఎంచక్కా గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించారు. మద్యపాన నిషేధం కంటితుడుపు చర్య, నిషేధం విషయంలో సీఎం నితీష్ బీహార్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని రాజవంశీ మహతో విమర్శించారు. బీహార్‌లో పేరుకే మద్యపాన నిషేధమని, రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, నగరంలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతోందని పేర్కొన్నారు. బీహార్‌లో లిక్కర్ దందాను కొన్ని మాఫియాలు నడిపిస్తున్నాయని ఆరోపించారు. అమాయక పేద ప్రజలపై చర్యలు తీసుకునే పోలీసులు ఆ మాఫియాపై మాత్రం చర్యలు తీసుకోవట్లేదన్నారు.