Friday, November 22, 2024

Bihar – ముచ్చ‌ట‌గా మూడో సారి కూలిన వంతెన‌

బీహార్ లో ఘ‌ట‌న
నిర్మాణంలో ఉండ‌గా ఇప్ప‌టికే రెండు సార్లు కూలిన బ్రిడ్జి
ఇసుక‌తో క‌డుతున్నారా అంటూ నెటిజెన్స్ విసుర్లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – బీహార్‌లో వంతెనలు కూలడం ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారింది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పాత వంతెనలు కూలిపోతున్న వార్తలు వినే ఉంటాం. ఈసారి మూడోసారి ఖగారియాలోని అగువానీ-సుల్తంగంజ్ మధ్య గంగా నదిపై నిర్మిస్తున్న నాలుగు లైన్ల వంతెన పిల్లర్ స్లాబ్ నిర్మాణం గంగా నదిలో పడి కూలిపోయింది. సుల్తాన్‌గంజ్ నుండి అగువానీ ఘాట్ వైపు 9, 10 నంబర్ల మధ్య భాగం గంగా నదిలో మునిగిపోయింది. ఈ వంతెనను ఎస్పీ సింగ్లా కంపెనీ నిర్మిస్తోంది. భాగల్‌పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్‌లో నిర్మిస్తున్న ఈ వంతెన ఖగారియా, భాగల్‌పూర్ జిల్లాలను కలుపనుంది..

- Advertisement -

గ‌త ఏడాది జూన్ 4 కూడా, సుల్తాన్‌గంజ్-అగువానీ గంగా నదిపై నిర్మిస్తున్న నాలుగు లేన్ల వంతెన నేలమట్టం అయింది. నిర్మాణంలో ఉన్న వంతెన సూపర్ స్ట్రక్చర్ నదిలో పడిపోయింది. ప్రమాదం తర్వాత వంతెనపై విధులు నిర్వహిస్తున్న ఇద్దరు గార్డులు కూడా కనిపించకుండా పోయారు. ఆ సమయంలో అగువానీ వైపు నుండి వంతెన పీర్ నంబర్లు 10,11,12 పైన ఉన్న మొత్తం సూపర్ స్ట్రక్చర్ కూలిపోయింది, ఇది దాదాపు 200 మీటర్ల భాగం ఉంటుంది.


అంత‌కు ముందు 2022లో 27 ఏప్రిల్ 2022న నిర్మాణంలో ఉన్న ఈ వంతెన సూపర్ స్ట్రక్చర్ మరో సారి నదిలో పడిపోయింది. బలమైన తుఫాను, వర్షం కారణంగా సుమారు 100 అడుగుల పొడవు పడిపోయింది. అయితే ఆ సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఆ తర్వాత మళ్లీ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈసారి దాదాపు 80 శాతం సూపర్ స్ట్రక్చర్ పనులు పూర్తయ్యాయి. అంతే కాదు అప్రోచ్ రోడ్డు పనులు కూడా 45 శాతం పూర్తయ్యాయి. ఈ ద‌శ‌లో మరోసారి వంతెన కూలిపోయింది.. బీహార్ లో వంతెన‌లు ఇసుక‌తో క‌డుతున్నారా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement