ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. కాగా, రెండు రోజుల ఈ వార్మప్ మ్యాచ్‌లో భాగంగా కాన్‌బెరాలో (శనివారం) జరిగిన తొలి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు (ఆదివారం) వర్షం లేకపోవడంతో 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రెసిడెంట్ ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ సామ్ కోన్‌స్టాస్ (97 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 107) సెంచరీతో రాణించగా.. టేయిలెండర్ హన్నో జకోబ్స్(60 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్ (62 బంతుల్లో 7 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్(59 బంతుల్లో 9 ఫోర్లతో 45), తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42), వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 5 ఫోర్లతో 42 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. దాంతో ఈ సన్నాహక మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐదు టెస్టుల సిరీస్ లో (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.