Tuesday, November 26, 2024

న‌థింగ్ నుంచి బిగ్ అప్‌డేట్.. ఇండియాలోనే ఫోన్​ తయారీ!

నథింగ్ ఫోన్-2 ను భారత్ లోనే తయారు చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. యూకేకు చెందిన ఈ ప్రముఖ స్మార్ట్ పోన్ బ్రాండ్ నథింగ్ ఫోన్ 1 ను గతేడాది జూలైలోనే విడుదల చేసింది. ఆకర్షణీయమైన ట్రాన్సపరెంట్ డిజైన్ తో ఈ ఫోన్ మొబైల్ ప్రియులను కట్టిపడేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ కు అనతికాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది. నథింగ్ ఫోన్ 1 వచ్చి సరిగ్గా ఏడాది అవుతున్న తరుణంలో నథింగ్ ఫోన్ 2 ను జులై లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పై ఇదివరకే ప్రకటించారు. దీనికి సంబంధించి కొన్ని ఫీచర్లను కూడా వెల్లడించి మొబైల్ లవర్స్ ను టీజ్ చేశారు.

నథింగ్ ఫోన్ 1 కు ఇంకా అధునాతన ఫీచర్లు జోడించి నథింగ్ ఫోన్ 2 ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. డిస్ ప్లే సైజ్, బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. నథింగ్ ఫోన్ లో 2 లో 6.7 అంగుళాల డిస్ ప్లే, 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. నథింగ్ 1 తో పోల్చితే ఇవి కాస్త ఎక్కువ.

కాగా, నథింగ్ ఫోన్ 2 ను భారత్ లోనే తయారు చేస్తామని కంపెనీ గతేడాదే ప్రకటించింది. దేశవ్యాప్తంగా 270 కస్టమర్ సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తామని తెలిపింది. నథింగ్ ఫోన్ 2 ను భారత్ లో తయారు చేస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మను శర్మ మీడియాతో మాట్లాడారు. నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లు వాటి ఐకానిక్ పారదర్శక డిజైన్‌కు ప్రసిద్ధి చెందాయన్నారు. ఈ డిజైన్‌కు అత్యన్నత తయారీ ప్రక్రియ, కచ్చితమైన ఇంజనీరింగ్ అవసరమని పేర్కొన్నారు. ఇవే భారత్ లో స్మార్ట్‌ఫోన్ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి దారి తీశాయన్నారు. నథింగ్ ఫోన్లకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, భారత్ లో ఈ ఫోన్లను తయారు చేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement