యాసంగి పంటల సాగు ఊగిస లాడుతోంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో మందకోడిగా పంటలు సాగవుతున్నాయి. దీంతో ఈ యాసంగిలో పంటల సాగు తీరు గమనిస్తే సాగు చేయాలా వద్దా అన్నట్టు పరిస్థితులున్నాయని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించిన వివరాలు తెలుపుతున్నాయి. పది జిల్లాల్లో ఇప్పటికీ పది శాతం తక్కువగానే పంటలు సాగవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ యాసంగిలో ప్రభు త్వం వరి పంటలు వేయుెెద్దని సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం లక్షా 18వేల ఎకరాల్లో వరి సాగైంది. అయితే వరి విస్తీర్ణం సీజన్ ముగిసేనాటికి పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. మరోవైపు చిరుధాన్యాలను విరివిగా పండిం చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నా.. రాష్ట్రంలో ఆశించిన మేర చిరుధాన్యాల పంటలు సాగుకావడంలేదు. అన్ని రకాల మిల్లెట్స్ కలుపుకుని కూడా టార్గెట్ రీచ్ కాకపోవడం గమనార్హం.
ఈ ఏడాది యాసంగి పంటలు కొన్ని జిల్లాల్లో పది శాతం కూడా దాటకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అయితే ఆలస్యంగానైనా సాగవుతాయా లేక, ప్రభుత్వం సూచించిన పంటల మార్పిడిలో ఇతర పంటలు వేయలేక రైతులు అసలు సాగునే మానుకున్నారా అన్నది వ్యవసాయశాఖకు చిక్కు ప్రశ్నగా ఉండిపోయింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 2శాతం మేరకే పంటలు సాగవ్వగా, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి జిల్లాల్లో 3శాతం, మెదక్, మంచిర్యా లలో 4శాతం, జగిత్యాలలో 8శాతం, ములుగులో 7, జనగాం 11, సూర్యాపేటలో 10శాతం మేర పంటలు సాగయ్యాయి. కాగా ఒక్క ఆదిలాబాద్‌లో మాత్రం సాధారణం కంటే అధికంగా 102 శాతం పంటలు సాగయ్యాయి. దీంతో ఆయా జిల్లాల్లో సాగు శాతం పెరుగుతుందా లేదా అన్న అంశాలపై వ్యవసాయ శాఖ చర్చిస్తుండగా, అసలు విస్తీర్ణం పెరుగుతుందా లేదా అన్నదానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనుకున్న చిరుధాన్యాలను రైతులు సాగుచేయడంలేదు. దీంతో పండాల్సిన దానికంటే తక్కువ విస్తీర్ణంలోనే చిరుధాన్యాల పంటలు సాగవుతున్నాయి. సజ్జలు 235 ఎకరాల్లో, రాగి 545, కొర్ర 204, ఇతర మిల్లెట్స్ 114 ఎకరాల్లో సాగయ్యాయి. వా స్తవానికి సజ్జల సాధారణ సాగు విస్తీర్ణం 22,967 ఎకరాలుగా ఉన్నా సాగుకావడంలేదు. రాగులు కూడా 689 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా సాగుకాకపోవడం గమనార్హం. జొన్నలు మాత్రం సాధారణ సాగు 75,274 ఎకరాలు కాగా ఇప్పటివరకు 52,882 ఎకరాల్లో 70 శాతం సాగైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital