బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై విస్తృతంగా కసరత్తు జరుగుతోంది. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వారసుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న దానిపై అధికారపక్షంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొత్త ప్రధాని ఎంపికపై తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరమైనాయి. కరోనా విజృంభించిన సమయంలో తన ఇంట్లో పార్టీ నేతలకు విందు ఇచ్చారన్న పార్టీగేట్ కుంభకోణం, బోరిస్ స్వయంగా నియమించిన పార్టీ చీఫ్ విప్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో మంత్రిమండలిలోని మెజారిటీ సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో బోరిస్ ప్రధాని పదవినుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో ప్రభావశీలురైన ఎంపీలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. తమ తరపున నిధులు, మద్దతు, ప్రచారం చేసేవారితో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తదుపరి ప్రధానిగా ఎవరిని నియమించాలన్న విషయంపై అధికార కన్సర్వేటివ్ పార్టీ చట్టసభ సభ్యులు ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఆ పదవిని కోరుకుంటున్నవారిలో ఇద్దరు మిగిలేవరకు పార్టీలో రౌండ్లవారీగా వోటింగ్ నిర్వహిస్తారు. చివరకు బరిలో మిగిలిన ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకునేందుకు జాతీయ స్థాయిలో ఓటింగ్ నిర్వహిస్తారు. అలా ఎంపికైన వ్యక్తే బ్రిటన్ తదుపరి ప్రధాని అన్నమాట. అందువల్లే పార్టీ ఎంపీల మద్దతు కోసం ప్రధాని పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బోరిస్ వారసుడిగా నిలిచేందుకు పెద్దసంఖ్యలోనే అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ ముందువరసలో భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ ఉన్నారు.
రిషి సునక్..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన రిషి సునక్ బ్రిటన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నానంటూ శుక్రవారం ఆయన ప్రచారం ప్రారంభించారు. దేశాన్ని సరైన దిశలో నడిపేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో చాన్సలర్‌గా దేశ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దిన సునక్ జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. అయితే, వ్యక్తిగతంగా, ఆర్థిక, న్యాయ వివాదాల్లో చిక్కుకుని కొన్ని విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన సతీమణి అక్షత ఇప్పటికీ భారతీయ పౌరసత్వం కలిగి ఉండటం, పన్నుల ఎగవేసేందుకే ఆమె ఆలా చేశారని విమర్శలు వచ్చాయి. ఇటీవలి కాలంలో జీవన వ్యయం అపరిమితంగా పెరిగిపోవడంతో ఆయనపై అసంతృప్తి నెలకొంది. బ్రిటన్ ఆర్థికమంత్రిగా ఉంటూ అమెరికా గ్రీన్‌కార్డ్ పొందడంపైనా విమర్శలు వచ్చాయి. ద్రవ్యోల్బణం జోరుకు కళ్లెం వేయడంలో సునక్ సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని విపక్షాలు విమర్శించాయి. కరోనా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన జాన్సన్ విందుకు హాజరవడంపైనా విమర్శలు రాగా ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆర్థికమంత్రిగా సునక్ వ్యవహరిస్తున్న సమయంలో 40 ఏళ్ల తరువాత తొలిసారిగా, మే నెలలో 9.1 శాతం మేర గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకుంది. గడచిన 21 ఏళ్లలో తొలిసారిగా కనిష్ట స్థాయికి వేతనాలు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో తదుపరి ప్రధానిగా ఎన్నుకోవాలని ఆయన కోరుతున్నారు. చట్టసభ సభ్యుల్లో ఆయనకు మంచి పట్టుండటం విశేషం.
సాజిద్ జావిద్..
బోరిస్ మంత్రిమండలిలో వైద్యశాఖ బాధ్యతలు నిర్వహిచిన సాజిద్ జావిద్ పేరు కూడా ప్రముఖంగా విన్పిస్తోంది. పార్టీ చీఫ్ విప్‌గా పించర్ నియామకాన్ని తప్పుబట్టిన ఆయన రాజీనామా చేసిన మంత్రుల్లో మొదటి వ్యక్తిగా నిలిచారు. ఆయన ప్రకటించిన మరునిమిషమే ఆర్థికమంత్రి రిషి సునక్ కూడా రాజీనామా చేశారు. ప్రధాని రేసులో ఉన్నట్లు సాజిద్ స్పష్టం చేయనప్పటికీ ఆయన ప్రసంగం మాత్రం ఆ దిశగానే కొనసాగింది. ఆయన ఇప్పటివరకు రెండుసార్లు పార్టీ బాధ్యతలు నిర్వహించారు. బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన 2016లోను, ప్రధానిగా జాన్సన్ ఎన్నికైన 2019లోనూ ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.
లిజ్ ట్రస్…
మాజీ విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ కూడా ప్రధాని రేసులో ఉన్నారు. 2016లోనూ ఆమె ప్రధాని పదవిని ఆశించారు. అయితే ఐరోపా సమాఖ్యనుంచి విడిపోయే వివాదం నేపథ్యంలో ఆమెకు అవకాశం దక్కలేదు. గతంలోనూ మంత్రివర్గంలో పనిచేసిన ట్రస్ చుట్టూ ప్రతిభావంతులైన బృందం అండగా ఉంది. పైగా ఆమె మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌లా వ్యవహరించేందుకు ప్రయత్నించి అందరి దృష్టిలో పడ్డారు. యుద్ధట్యాంక్‌ను నడిపినప్పుడు తలకు పాగా కట్టుకోవడం వంటి అనుకరణలతో ఆమె పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేయడాన్ని తీవ్రంగా విమర్శించి ప్రజలకు దగ్గరయ్యారు. ఆమె వ్యవహారశైలి చాలా హుందాగా ఉంటుందన్న పేరుంది. నిజానికి ప్రధాని పదవికి ఆమె అన్నివిధాలా అర్హురాలు. అయితే, వీరిపై జాన్సన్ ముద్ర పడిన నేపథ్యంలో పార్టీ సభ్యులు ఎంతవరకు మద్దతు ఇస్తారన్నది సందేహం.
పెన్నీ మార్డంట్..
వాణిజ్యశాఖ మంత్రిగా పనిచేసిన పెన్నీ మార్డంట్ కూడా ప్రధాని రేసులో ఉన్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ జులై4న ప్రచురించిన ఓ పోల్ ఫలితాల్లో ఆమె రెండో స్థానంలో నిలవడం విశేషం. 2010లో తొలిసారిగా ఆమె పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. అప్పటి ప్రధాని థెరెసా మే మంత్రివర్గంలో అంతర్జాతీయ అభివృద్ధి, రక్షణ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. గత నెలలో జాన్సన్‌పై విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. నేనైతే ఈ ప్రధానిని ఎంచుకోనంటూ ఆ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
టామ్ టుగెన్‌థట్..
మాజీ మిలటరీ అధికారి, విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గావ్యవహరించిన టామ్ టుగెన్‌థట్ ప్రధాని రేసులో ఉన్నారు. మాజీ ప్రధాని బోరిస్‌పై తీవ్ర విమర్శలు చేసే వారిలో ఈయన మొదటి వ్యక్తి. విభజన రాజకీయాలను విడిచిపెట్టాలంటూ పార్టీకి నేరుగా సూచించే ధైర్యం ఆయన సొంతం. తాను మిలటరీలోను, పార్లమెంట్‌లో పనిచేసి దేశానికి సేవలందించానని, ప్రధానిగానూ పనిచేయాలనుకుంటున్నానని, మచ్చలేని పాలనకు శ్రీకారం చుట్టే సమయం ఇదేనని గురువారం ఆయన రాసిన ఓ వ్యాసంలో స్పష్టం చేశారు. మంత్రిగా కాని, షాడో కేబినెట్ సభ్యుడిగా కానీ అనుభవం లేకపోయినప్పటికీ మంచి వక్తగా, వివిధ అంశాలపై ఆయన చూపే శ్రద్ధ పేరుతెచ్చిపెట్టాయి. ప్రధానంగా అఎn్గానిస్తాన్ పతనంపై ఆయన పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం సభ్యులను ముగ్ధులను చేసింది. ఇరాక్, అఎn్గానిస్తాన్ యుద్ధాల్లో పనిచేసిన ఆయన 2015లో తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
నద్‌హిమ్ జహావి..
ప్రస్తుతం చాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌గా నియమితులైన నద్‌హిమ్ జహావి రేసులో ఉన్నారు. సునక్ రాజీనామా తరువాత ఆ బాధ్యతలు చేపట్టిన రెండురోజుల్లోనే ప్రధాని జాన్సన్ తప్పుకోవాలంటూ బహిరంగ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. సరైన నిర్ణయం తీసుకునినిష్క్రమించాలంటూ బోరిస్‌కు రాసిన లేఖను జత చేస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేయడం ప్రకంపనలు సృష్టించింది. బోరిస్ మంత్రివర్గంలో అతివేగంగా శాఖలు మారుతూ రాజకీయంగా ఎదిగారు. ఏడాది క్రితం ఆయన మంత్రివర్గంలో చేరారు. వ్యాక్సిన్లమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన కొద్దికాల పాటు బాధ్యతలు నిర్వహించారు. ఇరాక్‌లోని కుర్దిష్ దంపతులకు పుట్టిన జహవి తొమ్మిదేళ్ల వయసులో సద్దాం హయాంలో, బ్రిటన్‌కు కుటుంబంతో పాటు వలస వచ్చారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో అత్యంత సంపన్నుడైన ఎంపీగా ఆయనకు పేరుంది.
జెర్మీ హంట్..
2019లో ప్రధాని పదవిని ఆశించి బోరిస్ చేతిలో భంగపడ్డ జెర్మీ హంట్ వైద్య, విదేశాగ శాఖలు నిర్వహిస్తున్నప్పటికీ దాదాపు ప్రత్యర్థిగానే వ్యవహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం గట్టి పోటీదారుగానే ఉన్నారు. బోరిస్‌పై విశ్వాస తీర్మానం సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. కన్సర్వేటివి విధానాలు, బ్రిటన్ గౌరవాన్ని కాపాడాలంటే మార్పు కావాలని, తాను ఆ మార్పును కోరుకుంటున్నానని స్పష్టంగా పేర్కొన్నారు.
బెన్ వాలెస్..
రక్షణమంత్రిగా వ్యవహరించిన బెన్ వాలెస్ రష్యా దండయాత్ర నేపథ్యంలో వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంది. కన్సర్వేటివ్ పార్టీ పోల్‌లో తదుపరి ప్రధానిగా ప్రతిపాదించిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అయితే, తాను ప్రధాని పదవిని ఆశించడం లేదని, రక్షణమంత్రిగా దేశాన్ని కాపాడటంపైనే శ్రద్ధ పెట్టానని వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని పదవినుంచి వైదొలగాలని ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గం నుంచి తొలగించబడ్డ మైఖేల్ గోవ్ నిజానికి బోరిస్‌కు సన్నిహితులు. గత ఎన్నికల్లో ఆయనతో పాటు కలసి పనిచేశారు. ఇక యాంటీ గ్రీన్ ఎంపీగా ముద్రపడ్డ స్టీవ్ బాకర్ బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు. తాను ప్రధానిగా ఎన్నికైతే పర్యావరణ విధానాలన్నింటిని రద్దు చేస్తానని, దేశీయంగా సహజవాయు ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు.
సుయెల్లా బ్రేవర్మన్..
అటార్జీ జనరల్‌గా పనిచేస్తున్న సుయెల్లా బ్రేవర్మన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. జాన్సన్ పదవినుంచి తప్పుకోవాలని ఆమె ఏకంగా ఓ టీవీ డిబేట్‌లో పేర్కొనడం విశేషం. ప్రధాని పదవికి పోటీ పడటంతో ఒక గౌరవంగా ఆమె చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.