హైదరాబాద్, ఆంధ్రప్రభ: సంచుల్లో వజ్రాలను కొలిచే గోల్కొండ రాజులు, అంగట్లో వజ్రాలు అమ్మిన విజయనగర రాజులు, విదేశాలకు వజ్రాలను ఎగుమతి చేసిన కాకతీయ రాజులు ఏలిన తెలుగు ప్రాంతాల్లో భూగర్భ నిధి నిక్షేపాలకు కొదవలేదు. రాజులు అంతరించినా, పాలనా వ్యవస్థ మారినా గతవైభవాలను స్మరిస్తూ, ప్రాచీన ఆధారాలను సృజిస్తే ఆనాటి వైభవాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి. అయితే ఆనాటి రాజులు వజ్రాలను సేకరించిన గనులు మాత్రం కాలగమనంలో కలిసిపోయినా చరిత్రకారులు వాటి అనేషణలో నిమగ్నమై ఆనాటి వజ్రగనులతో పాటు నూతనంగా నదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రగనులు ఉన్నట్లు శాస్త్రీయ పరిశోధనల్లో వెలుగు చూశాయి. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతం, కృష్ణానదీపరివాహక ప్రాంతాల్లో వజ్రాల జోన్లు 36 ఉన్నట్లు భూగర్భ పరిశోధకులు, విశవిద్యాలయాల అధ్యయనం, పురావస్తు శాఖ పరిశోధనల్లో వెలుగు చూసిన అంశం.
కృష్ణమ్మ పరుగుల కింద మిళమిళ మెరిసే వజ్రాల గనులు ఉన్నట్లు జియోలాజికల్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
గత రెండు సంవత్సరాలుగా దశవారిగా సరేలు, భూగర్భ పరిశోధనలు చేసిన నిపుణులు అనేక అంశాలను కనుగొన్నారు. తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నాణ్యమైన వజ్రాలు ఉన్నాయని నివేదికల్లో పొందుపర్చారు. 400 సవత్సరాల భూగర్భ డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా ప్రవహించే నల్లమల అడవుల ప్రాంతాల్లో జరిపిన సరేలో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు బహిర్గతమైంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలాన్ని ఆనుకుని ఉండే నల్లమల అటవీప్రాంతం పరిధిలో నాణ్యమైన వజ్రనిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ శాస్త్రవేత్తలు నిర్దారించారు. వజ్రాలతో పాటు బంగారం ముడిఖనిజాలు అమితంగా ఉన్నట్లు వెల్లడైంది. 400ల సంవత్సరాల క్రితమే గోల్కొండ రాజులు ఈ ప్రాంతాల్లో వజ్రాల కోసం గనులు తవ్వినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆగనుల ఆనవాళ్లు మాత్రమే లభిస్తున్నాయి. భారతదేశాన్ని పాలించిన అనేక మంది రాజులు తమ సంపదలో అత్యంత విలువైన వజ్రాలను కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచే సేకరించినట్లు చరిత్ర ఆధారాలున్నాయి.
ఇందులో తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నస్కాక్, డ్యూక్, హోప్‌దారియఇనూర్, రీజెండ్ డ్రెస్ డెన్ గ్రీన్, అర్లోవ్, జాకబ్ వజ్రాలుండగా కొల్లూరు(ఆంధ్ర) ప్రాంతంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం లభించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రికార్డులను పరిశీలించి టన్నులకొద్ది వజ్రాలను బ్రిటిష్‌కు తరలించినట్లు చరిత్ర కారులు చెప్పారు. చరిత్రకారుడు మహ్మద్ సఫిల్లా రికార్డుల మేరకు గోల్కొండ రాజులు గనుల్లోంచి 12మిలియన్ల క్యారెట్ల వజ్రాలు సేకరించారని పేర్కొన్నారు. 1689లో జీన్ బాపిస్ట్ టావెర్నియర్ రాతలమేరకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని వజ్రాల గనుల్లో వేలాది కార్మికులు పనిచేసేవారని రాజులు స్వయంగా పర్యవేక్షించిన సందర్భాలు ఉన్నయని పేర్కొన్నారు. అయితే ఆనాడు టన్నుల కొద్ది వజ్రాలు లభించిన ప్రాంతాల్లో నేటికి వజ్రాల గనులు ఉన్నాయని పేర్కొన్నారు.
భూమిపొరల్లో భద్రంగా ఉన్న వజ్ర ఖనిజాలను వెలికి తీసేందుకు ప్రభుతం ప్రత్యేకమైన విభాగం ఏర్పాటుచేస్తే తెలంగాణ సుసంపన్న రాష్ట్రంగా కీర్తిసాధిస్తోందని చరిత్రకారులు భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ బీమానదీ కృష్ణలో కలిసే ప్రదేశం, గదాలలో తుంగభద్ర కలిసే ప్రదేశంలో వజ్రాల గనులు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైందీ, అలాగే గతకొద్ది సంవత్సరాల క్రితం వజ్రాల అనేషణలో భాగంగా ప్రైవేటు సంస్థ జరిపిన సరేలో మహబూబ్ నగర్‌లోని నల్లమల అడవుల్లో వజ్రాల నిక్షేపాలతో పాటుగా బంగారు ఖనిజసంపద అపారంగా ఉందని గుర్తించింది. ఇటీవల నల్గొండ జిల్లాలో ఓరైతుకు వజ్రం దొరకడంతో పరిశోధనలు వేగం పుంజుకున్నాయి. రామడుగు, చుండూరు, డిండీ, హోలియా, కనగల్‌లో వజ్రాల నిక్షేపాలున్నట్లు తెలిసింది. ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా చేసిన సరేలో చెన్నూరు మండలం ఉప్పర పల్లిలో అపారమైన వజ్రాల నిలువలున్నట్లు కనుగొన్నారు. ప్రస్తుతం ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఇక్కడ 37 చదరపు కిలోమీటర్ల మేర వజ్రాలున్నాయని సరేలో పొందుపర్చారు.
తెలంగాణ కోటి వజ్రాల వీణ
”తెలంగాణ కోటి వజ్రాల వీణ” అన్న దాశరథి మాటలు అక్షర సత్యాలు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాచీన వజ్రాల గనలు ఉన్నయి. కొత్తగా తవ్వకాలు చేసేందుకు వజ్రాల నిలువలున్న ప్రాంతాలు ఉన్నాయి. అయితే తవ్వకాలు జరిపితే జాకబ్, కోహీనూర్ వజ్రాల కంటే విలువైనవి దొరికే అవకాశాలున్నాయి. తెలంగాణలో కృష్ణమ్మ ప్రహించే ప్రాంతాల్లో వజ్రాల నిల్వలున్నట్లు ఎన్‌జీఆర్‌ఐ చెందిన ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ అంతర్జాతీయ జనరల్‌లో ప్రచురించారు. గత గనులు కాకుండా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 25 కొత్త ప్రదేశాలున్నయని జనరల్‌లో పేర్కొన్నారు. నారాయణపేట, యాదగిరి, కొత్తపేట, దేవరకద్ర, మక్తల్, రాయచూరు వైపు వెళ్లే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భౌగోళిక పరిణామాల నేపథ్యంలో భూమి పొరల్లో 500 మీటర్ల నుంచి 1200 మీటర్ల లోతులో అపారమైన వజ్ర, బంగారు ఖనిజాలున్నాయి.
మూసీనదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రాలు
తరతరాల నాగరికతలకు నిలయంగా నిలిచిన మూసీ నదీ పరివాహక ప్రాంతాలు ఒకప్పుడు వజ్రాల గనులకు సుప్రసిద్ధని ఇటీవల పురావస్తు పరిశోధనల్లో వెల్లడైంది. మూసీనదీ వాడపల్లి దగ్గర కృష్ణానదీలో కలిసే ప్రాంతంలోని పరివాహక ప్రాంతాల్లో వజ్రాలు ఉన్నయని ఎన్‌జీఆర్ నివేదకల్లో స్పష్టం చేసింది. వాడపల్లి నుంచి 400 చదరపు కిలోమీటర్ల పరిధిలోని భూమిపొరల్లో అమూల్యమైన సంపద ఉంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో లభ్యమవుతున్న కింబర్ లైట్ శిలలు అధికంగా ఉన్నాయి. వాడపల్లి, రామడుగు, మిర్యాలగూడ, రామన్నపేట, ఉస్తాద్‌పల్లిలో అపారమైన లాంప్రొయిట్ ఖనిజాలున్నాయని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అమెరికా పెలాజీయా విశ్వవిద్యాలయం సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం జరిపిన సర్వేలో స్పష్టమైంది. అలాగే నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పరిశోధనలు జరగుతున్నాయి. భూమిపొరల్లో 0.5నుంచి 3మీటర్ల మందం లాంప్రొయి ఖనిజాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.
వజ్రాల కోసం ప్రభుత్వం తవ్వకాలు ప్రారంభించాలి
కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లి సుల్తానులు దాడులు చేసినా, గోల్గొండ కోటను ఔరంగాజేబు ముట్టడించినా ధనరాశులను దోచుకు పోయేందుకేనని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ డా.చిన్నారెడ్డి చెప్పారు. తెలంగాణ విశాలంగా విస్తరించి ఉన్న కృష్ణాపరివాహక ప్రాంతంలోని వజ్రాలతోనే గోల్కొండ రాజ్యం సుసంపన్నమైందని చెప్పారు. అనంతరం అధికారాన్ని చేపట్టిన ఆసఫ్ జాహీలు(నిజాం) ప్రపంచంలో ధనవంతులు కావడానికి గోల్కొండ కోటలోని సంపదే కారణమని చెప్పారు. ఇటీవల జరిపిన పరిశోధనల్లో మూసీ పరివాహక ప్రాంతం వజ్రాలతో నిండి ఉందని చెప్పారు. అలాగే నల్లమల, నల్గొండ, మహబూబ్ నగర్ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో విస్తరమైన వజ్రాలు, బంగారం ఖనిజ సంపద ఉందని చెప్పారు. అయితే ప్రభుత్వ రంగంలో వజ్రాల గనులు ఏర్పాటు చేస్తే తెలంగాణ అపారమైన సంపదతో అంతర్జాతీయ ఖ్యాతి పొందే అవకాశాలున్నాయన్నారు.