అమరావతి, ఆంధ్రప్రభ: అసెంబ్లి బడ్జెట్ సమావేశాలు మరో వారంలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో వైద్యారోగ్య, వ్యవసాయ రంగాల తర్వాత అత్యధిక ప్రాధాన్య రంగంగా ఉన్న విద్యకు చేయబోయే కేటాయింపులపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెండేళ్లుగా వార్షిక బడ్జెట్‌లో దాదాపు పది నుంచి 15 శాతం వరకు కేటాయింపులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో విద్యారంగానికి జరపబోయే కేటాయింపులపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. 2019- 20లో దాదాపు రూ. 33 వేల కోట్లు, 2020- 21లో రూ. 24 వేల కోట్లకుపైగా విద్యారంగానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రణాళికా వ్యయంతోపాటు ప్రణాళికేతర వ్యయం చూసినా బడ్జెట్ కేటాయింపులకు, వాస్తవ ఖర్చుకు ఏ ప్రభుత్వ శాఖలోనూ ఆ అంకెలు చేరుకోవడం లేదని తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం నవరత్నాలు, సంక్షేమ పథకాలకు భారీగా చేస్తున్న ఖర్చే. విద్యారంగంలో మాత్రం మన బడి నాడు- నేడు కింద మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 వేలకుపైగా పాఠశాలలను బాగు చేస్తామని ప్రకటించడంతోపాటు తొలి ఏడాది 15 వేలకుపైగా బడులను ఎంపిక చేసి, కొత్త రూపురేఖలు తీసుకొచ్చారు. అనంతరం కోవిడ్ సంక్షోభం కారణంగా ఈ పనులూ మందకొడిగా సాగుతున్నాయి. రెండో విడత పనులు గతేడాది నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా.. పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది విద్యారంగానికి రూ. 24 వేల 624.22 కోట్లు కేటాయించారు. రాబోయే వార్షిక బడ్జెట్‌లో దాదాపు రూ. 30 వేల కోట్ల వరకు కేటాయింపులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌లో జరగబోయే కేటాయింపులను బట్టి పనులు ఊపందుకోనున్నాయి.
పలు శాఖల్లో నాడు- నేడు..
పాఠశాల విద్యలో నాడు- నేడు పథకం తీసుకొచ్చిన మార్పులకు పలు రాష్ట్రాల నుంచి ప్రశంసలు అందాయి. దీంతో ఈ స్ఫూర్తితో అంగన్‌వాడీలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలతోపాటు, సాంకేతిక విద్యలోని పాలిటెక్నిక్ కళాశాలలకూ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వైద్యారోగ్య శాఖలోనూ పథకాన్ని ప్రారంభించి పీహెచ్‌సీలకు కొత్త కళ తెస్తోంది. ఈ నేపథ్యంలో రెండో విడత నాడు- నేడుకు కేటాయింపులు పెరగాల్సి ఉంది. అలాగే రాష్ట్రంలో దాదాపు 400కుపైగా కొత్త జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరగనున్నాయి. మొదటి విడత నాడు- నేడుకు రూ. 3 వేల 500 కోట్ల వరకు ఖర్చు చేయగా.. రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా 16 వేల 368 పాఠశాలలను రూ. 4 వేల 535 కోట్లతో అభివృద్ధి చేయాలని గతేడాది సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఇటీవల పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 3 వేల 199 పాఠశాలల కోసం రూ. 2 వేల 538.96 కోట్ల పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. మరోవైపు ఇటీవల విద్యారంగంపై సీఎం నిర్వహించిన సమీక్షలో మాత్రం ఫేజ్- 2 కింద 12 వేల 680 పాఠశాలలను దాదాపు రూ. 4 వేల 500 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద గతేడాది కన్నా ఈ ఏడాది నాడు- నేడుకు కేటాయింపులు పెరగనున్నట్లు తెలుస్తోంది.
అమ్మఒడికి అత్యధికంగా..
రాష్ట్రంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించేందుకు ప్రారంభించిన జగనన్న అమ్మఒడి కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ. 14 వేలు జమ చేస్తున్నారు. ఈ లెక్కన గతేడాది ఈ పథకం కోసం రూ. 6 వేల 107 కోట్లు ఖర్చు చేశారు. గతేడాది కోవిడ్ కారణంగా హాజరు నిబంధనకు సడలింపునివ్వగా.. ఈ ఏడాది నుంచి 75 శాతం హాజరు తప్పనిసరి చేశారు. అయితే గతంలో జనవరిలో ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. ఈసారి జూన్‌లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కారణంగా సర్కార్ బడుల్లో గణనీయంగా చేరికలు పెరగడంతో ఈ ఏడాది అమ్మఒడి కేటాయింపులు దాదాపు రూ. 7 వేల కోట్లు దాటనున్నట్లు అంచనా.
విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద..
విద్యారంగంలో అమ్మఒడి తర్వాత కీలకమైన పథకం జగనన్న విద్యాకానుక. పాఠశాల విద్యార్థులకు యూనిఫాం నుంచి షూస్, సాక్సుల వరకు అన్ని వస్తువులను ప్రభుత్వమే అందిస్తోంది. గతేడాది నుంచి అదనంగా ఇంగ్లిష్- తెలుగు- ఇంగ్లిష్ నిఘంటువునూ కానుకలో చేర్చింది. ఈ పథకానికి కేంద్రం నుంచి కేవలం యూనిఫాంకే నిధులు అందుతాయి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పథకానికి గతేడాది రూ. 750 కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఏడాది రూ. 800 కోట్లకుపైగా అవసరమవుతాయని అంచనా. అలాగే ఉన్నత విద్యలో రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న విద్యాదీవెన, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం వసతి దీవెన పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. గతేడాది జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు, జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు- ప్రభుత్వం ఖర్చు చేయగా.. ఈ ఏడాది దాదాపు ఐదు శాతం అదనంగా కేటాయించాల్సి ఉంటుందని అంచనా. అంగన్‌వాడీల నుంచి జూనియర్ కళాశాలల వరకు మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ‘జగనన్న గోరుముద్ద’. దీని కోసం గతేడాది రూ.1200 కోట్లు- కేటాయించారు. నిత్యావసరాల ధరలు పెరగడం, మెనూల్లో మార్పులు, విద్యార్థుల సంఖ్య పెరగడం వంటి కారణాలతో ఈ ఏడాది రూ. 1500 కోట్ల వరకు అవసరమని అంచనా. మరోవైపు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలల కోసం గతేడాది ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తం కూడా రూ. 2 వేల కోట్లు దాటనుంది. మొత్తంగా విద్యారంగానికి రాబోయే బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..