Saturday, November 23, 2024

Big Story: టార్గెట్‌ 2023 ఎలక్షన్స్‌.. ఆఫీసర్ల ట్రాన్స్‌ఫర్‌కు సన్నాహాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో కీలక అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. టార్గెట్‌ 2023ను దృష్టిలో పెట్టుకుని బదిలీల్లో సీఎం మెరుపులు మెరిపించనున్నారు. గత ఆరేళ్ళుగా అనేక ముఖ్యస్థానాల్లో ఉన్న అధికారులకు బదిలీలు లేకపోగా, పదోన్నతులు వచ్చినా.. రెండేళ్లకుపైగా అదే ఉద్యోగం చేస్తున్న ఐపీఎస్‌లు ఉన్నారు. ఇపుడు అధికారుల బదిలీలకు, పాలనా యంత్రాంగ పునర్వ్యవస్థీకరణకు సమయం ఆసన్నమైందని ప్రభుత్వవర్గాలలో చర్చ జరుగుతోంది. కనీసం 40మంది ఐపీఎస్‌ అధికారులు, 20మంది ఐఏఎస్‌ అధికా రులకు బదిలీ ఉంటుందని, మొత్తంగా 50 నుండి 70మంది అధికారులకు స్థాన చలనం ఖాయమన్న చర్చ ఉంది.

గత కొద్దిరోజులుగా విపక్షాలు చేస్తున్నా ఆరోపణలు తిప్పికొట్టేలా, సీఎంవోతో సహా.. ముఖ్యశాఖల్లోనూ మార్పుచేర్పులు జరిగే అవకాశ ముందన్న ప్రచారం ఉంది. వచ్చే అసెంబ్లిd ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల్లో.. మరింత ప్రభావవంతంగా పనిచేసే అధికారులను నియమించి ప్రభుత్వపరంగా మరింత ఫలితాలు చూపాలని భావిస్తున్నారు. పోలీసు బదిలీల కోసం గత రెండేళ్ళుగా ఎదురుచూస్తుండగా, ఇపుడు సరైన సమయం చూసి.. సీఎం ప్రక్రియ చేపట్టారు. ఈనెల 18న సీఎం కలెక్టర్ల సమావేశం ఏర్పాటుచేయగా, జిల్లాల పర్యటనకు ముందు లేదా.. జిల్లాల పర్యటన తర్వాత ఈ భారీ బదిలీల జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సీఎంవోతో పాటు ఐటీ, పరిశ్రమలు తదితర శాఖల్లోని కొందరు ముఖ్య అధికారులు.. ఆరేడేళ్ళుగా.. ఒకే స్థానంలో ఉన్నారు. వీరి ప్రాధాన్యం కొనసాగిస్తూ.. స్థాన చలనం కలిగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

పోలీస్‌ శాఖలో ఎస్పీ నుంచి డీజీ దాకా బదిలీలు
తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన జిల్లాల్లో కమిషరేట్లలో చాలామంది అధికారులు బదిలీ కాకుండానే ఉన్నారు. సహజంగా మూడేళ్లకు ఒకసారి బదిలీలు ఉంటాయి. కానీ సిద్దిపేట కమిషనర్‌, రాచకొండ కమిషనర్‌, మహబూబాబాద్‌, సిరిసిల్ల ఎస్పీలు ఏళ్ళుగా ఒకే పోస్టులో ఉంటున్నారు. మరికొంత మందికి ప్రమోషన్‌ వచ్చినా.. అన్నీ ఒకేసారి బదిలీచేయాలన్న ఉద్దేశ్యంతో సీఎం ఈ ప్రక్రియకు పూనుకోలేదు. కరోనా, వరుస ఎన్నికలు కూడా వీటిపై దృష్టి పెట్టనివ్వలేదు.

ముఖ్యమైన పోస్టులకు భారీ పోటీ
ష హైదరాబాద్‌ కమిషనర్‌గా అదనపు డీజీ లా అండ్‌ ఆర్డర్‌ జితేందర్‌ లేదా డిప్యూటేషన్‌పై సీఐఎస్‌ఎఫ్‌కి వెళ్లిన వచ్చి ఆరు నెలల నుంచి పోస్టింగ్‌ కోసం వేచిచూస్తున్న అదనపు జీడీ సీవీ ఆనంద్‌ను నియమించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతమున్న సీపీ అంజనీ కుమార్‌ ఏసీబీ డీజీగా బదిలీ అవుతారని లేదా అంతే ప్రాధాన్యమున్న పోస్టు దక్కవచ్చని వినబడుతోంది.

రాచకొండ కమిషనర్‌గా ఐజీ నాగిరెడ్డి లేదా ప్రస్తుతం సిటీ కమిషనరేట్‌లో పని చేస్తున్న డీఎస్‌ చౌహాన్‌కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఉంది. సీఐడీ విజిలెన్స్‌ చీఫ్‌గా ప్రస్తుత కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీఐడీ, ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న గోవింద సింగ్‌ను జైళ్ల శాఖకు డీజీగా నియమించే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పదోన్నతి పొంది ఇంకా నల్లగొండ ఎస్పీ బాధ్యతలు చూస్తున్న రంగనాధ్‌ను అక్కడి నుండి రిలీవ్‌ చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

రాష్ట్ర అడిషనల్‌ లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీగా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బి.శివధర్‌రెడ్డిని గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ అదనపు డీజీగా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. జిల్లాల్లోని ఎస్పీ కేడర్‌కి చెందిన అధికారులు మొత్తం 25 మంది బదిలీ కానున్నారు. నగరంలో పని చేస్తున్న వారిని జిల్లాలకు ఎస్పీలుగా బదిలీ చేయనున్నారు. నార్త్‌ జోన్‌ డీసీపీతో పాటు రాచకొండ, సైబరాబాద్‌లో పని చేసే వారిని జిల్లాలకు పంపించి.. జిల్లాలలో ఎప్పటి నుంచో పని చేస్తున్న వారిని హైదరాబాద్‌కి రప్పిస్తున్నారని తెలుస్తోంది. సీఐడీలో పని చేస్తున్న అధికారులకు కూడా బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సుమారుగా 30 నుండి 40మంది ఐపీఎస్‌ల బదిలీలు ఉండే అవకాశాలున్నాయి.

ఐఏఎస్‌ల్లోనూ బదిలీలు
ఐఏఎస్‌ల బదిలీలు కూడా భారీగా జరగబోతున్నాయి. గతంలో పలుమార్లు బదిలీలు జరిగినా.. ఇపుడు ప్రభుత్వ ప్రాధాన్యశాఖలకు సమర్ధులైన అధికారులను తీసుకు రావాలని, సామాజిక న్యాయం కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మునిసిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌కు ఐదు శాఖలున్నాయి. ఐ అండ్‌ పీఆర్‌, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ స్పెషల్‌ ఇలా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జయేష్‌రంజన్‌ మొదటి నుండీ ఐటీ శాఖ చూస్తున్నారు. ఇద్దరి శాఖలు పరస్పర మార్పులు జరగవచ్చని లేదా అవే స్థానాల్లో కొనసాగించవచ్చునని అంటున్నారు. సీఎంవోలో స్మితాసబర్వాల్‌ తెలంగాణ ఏర్పడిన నాటి నుండీ పనిచేస్తున్నారు. సింగరేణి సీఎండీగా శ్రీధర్‌ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికిపుడు ఇలాంటి స్థానాల్లో మార్పులు ఉండకపోవొచ్చన్న చర్చ ఉంది. అయితే దాదాపు 20మంది ఐఏఎస్‌లను బదిలీ చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ దఫా జాబితాలు భారీగా ఉంటాయని, మళ్ళీ ఎన్నికల దాకా.. ఇక బదిలీలు పెద్దగా ఉండే అవకాశాలు లేవని అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement