తెలంగాణలో ఇంటర్ ప్రథమసంవత్సరం పరీక్షల్లో 51శాతం మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు. ఇదే పరిస్థితి సెకండ్ ఇయర్ పరీక్షల సందర్భంగానూ తలెత్తుతుంది. గతంలో లాగా పరీక్షల్లో పాస్ చేస్తారని ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు పెద్దగా చదువులపై దృష్టి పెట్టలేదు. కానీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించడంతో లక్షలమంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు. తమ భవిష్యత్తుపై అనేక కలలుగన్న విద్యార్ధులు ఫెయిలైతే.. ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది. బలహీనులు బలవన్మరణాలకు పాల్పడే ప్రమాదం ఉండగా, కొందరు చదువులకు దూరంగా పారిపోయే ప్రమాదముంది. తల్లితండ్రుల నీడలో మరికొందరు మగ్గుతారు.
కొత్త తరం కొవిడ్ వల్ల ముప్పు ఎదుర్కొంటోంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కరోనా సమయంలో చదువులు ముందుకుసాగలేదు. విద్యారంగం దెబ్బతింది. తెలంగాణలో 51శాతం మంది విద్యార్ధులు ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ కాగా, సెకండ్ ఇయర్‌లో కూడా ఇదే స్థాయి పునరావృతం అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే.. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఇంజనీరింగ్, ఫార్మా, డిగ్రీ కాలేజీలు మరింత సంక్షోభంలోకి వెళ్ళి మూతపడే అవకాశాలున్నాయి. కొత్త తరాన్ని కౌమారదశలో ఉన్న పిల్లలను.. సున్నితంగా సమస్య నుండి గట్టెక్కించకుంటే రేపటి సమాజం ఎంతో నష్టపోతుంది. దీనికి పరిష్కారం ప్రభుత్వాలు, నిపుణులు ఆలోచించాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital