Saturday, November 23, 2024

Big Story: పెట్రో మంట.. లీటర్‌పై రూ.12 నుంచి 15 పెంపు?

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గమంటున్నాయి. రికార్డు స్థాయిలో చమురు ధరలు పెరుగుతున్నాయి. గురువారంనాడు బ్యారెల్‌ చమురు 111 డాలర్లుండగా, శుక్రవారంనాడు 120 డాలర్లు దాటింది. ఇప్పట్లో చమురు ధరలు దిగివచ్చే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత క్షీణించినందున దేశీయంగా ఆయిల్‌ కంపెనీలు గతకొంతకాలంగా నష్టాలు చవిచూస్తున్నాయి. దీంతో పెట్రోలియం ధరలు పెంచాలని ఆయిల్‌ కంపెనీలు ప్రతిపాదించాయి. ప్రభుత్వం ఆమోదం తెలిపితే… లీటర్‌ పెట్రోల్‌పై రూ.12.1 నుంచి రూ.15.1పైసల వరకు పెంపుదల ఉంటుందని ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ పేర్కొంది. మార్చి 16లోపు ఈ పెంపుదల అమల్లోకి వచ్చే అవకాశముందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తన నివేదికలో వెల్లడించింది.

భారత చమురు మంత్రిత్వ శాఖ పీపీఏసీ (పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌) సమాచారం మేరకు 2012 తర్వాత మార్చి 3న క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ 117.39 డాలర్లతో భారత చమురు సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా బ్యారెల్‌ చమురు సరాసరి 81.5 డాలర్లతో భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది నవంబర్‌ మొదటివారం వరకు ఇలాగే కొనసాగింది. ఉక్రెయిన్‌- రష్యా మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నప్పటి నుంచి విశ్వవిపణిలో చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా అదేస్థాయిలో క్షీణిస్తూ వస్తోంది. తత్ఫలితంగా దేశీయంగా ఆయిల్‌ కంపెనీలు నష్టాలు చవిచూస్తున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇక్కడ పెట్రోలియం ధరలు పెంపుదల చేయడం లేదు. చమురు సంస్థలు నష్టాల ఊబి నుంచి బయటపడాలంటే పెట్రోలియం ధరలు పెంపుదల మార్గమొక్కటే అని అంచనాకొచ్చాయి. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లిd ఎన్నికలు ముగిసిన అనంతరం ఏక్షణమైనా పెట్రోల్‌తోపాటు డీజెల్‌, గ్యాస్‌ ధరలు పెంచాలని చమురు సంస్థలు నిర్ణయించాయని జేపీ మోర్గాన్‌ తన నివేదికలో పేర్కొంది. మార్చి 7న ఉత్తర్‌ప్రదేశ్‌ తుది విడత ఏడో దశ పోలింగ్‌ ముగియనుంది. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మార్చి 8 నుంచి లేదా 11 నుంచి పెట్రోల్‌, డీజెల్‌, గ్యాస్‌ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement