అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు చెందిన విద్యుత్ బిల్లుల సర్‌ఛార్జిలను వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా చెల్లించేందుకు ఏపీఈఆర్సీ వెసులుబాటు కల్పించింది. ఈ సంస్థలన్నీ వన్-టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా ఎలాంటి సర్‌చార్జీలు లేకుండా తమ విద్యుత్ బకాయిలను చెల్లించవచ్చని తెలిపింది. ఇది సెప్టెంబరు 9, 2022కు ముందున్న బకాయిలను పూర్తిగా చెల్లించిన వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఈమేరకు దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థలకు ఈనెల 8న ఏఈపీఆర్సీ లేఖ రాసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు సంస్థల పరిధిలో వివిధ ప్రభుత్వ సంస్థలు మరియు స్థానిక సంస్థలు రూ.9,249 కోట్ల మేర బకాయిపడ్డాయి. ఇటీవల ఏపీఈఆర్సీ మార్చి 31, 2022 నాటికి వివిధ ప్రభుత్వ, స్థానిక సంస్థల నుండి మూడు డిస్కమ్‌లకు రావల్సిన బకాయిలపై సమీక్ష నిర్వహించింది. ఈసందర్భంగా మూడు డిస్కంల పరిధిలో మొత్తం బకాయిలు రూ. 9,249 కోట్లు-గా గుర్తించింది. వీటి చెల్లింపుల కోసం ఆయా శాఖలకు, స్థానిక సంస్థలకు పదే పదే ప్రత్యుత్తరాల ద్వారా సంప్రదించినప్పటికీ ఎటువంటి పురోగతి లభించలేదని ఒక నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుతం డిస్కంల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ బకాయిలను ఒన్ టైం సెటిల్ మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటును ఏపీఆర్సీసీ కల్పించాలని భావించింది. ఆమేరకు బకాయిలు ఉన్న సంస్థలకు, శాఖలకు లేఖలు రాస్తోంది.
వాడుకున్న విద్యుత్ ఛార్జీలను వసూలు చేయగలిగితే ఆర్ధిక పరి స్థితి మెరుగుపడుతుందని, తద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించగలమని కమిషన్ భావించింది. అందువల్ల ఏపీఈఆర్సీ ఈ సర్ ఛార్జీలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే పులివెందుల మున్సిపల్ కమిషనర్ నుండి ఏపీఎస్పీడీసీఎల్‌కు ఒక విజ్ఞాపన అందింది. తమ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రూ. 6.66 కోట్ల బకాయిలను వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించాలని కమిషనర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీకి లేఖ రాశారు. ఈ మొత్తంలో సర్ ఛార్జీల మినహాయింపు లభించనుంది. ఇదే తరహాలో అన్ని స్థానిక సంస్థలు, అన్ని శాఖల పరిధిలో పెండింగ్ బకాయిలను వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా సెటిల్ చేసుకునేందుకు విజ్ఞప్తులు వస్తున్నాయి. వాటిని పరీశీలించి తగునిర్ణయం తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఏపీఈఆర్సీ కల్పించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.