Tuesday, November 26, 2024

Big Story: క‌రెంటు కోతలతో కటకట.. ఆందోళనలో పరిశ్రమల యాజమాన్యం

అమరావతి, ఆంధ్రప్రభ : కోవిడ్‌ కారణంగా కుదేలైన పారిశ్రామికరంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా డిస్కంలు తీసుకున్న నిర్ణయం పరిశ్రమలకు శరాఘాతంగా మారనున్నది. ఉత్పత్తులను పెంచుకునేందుకు యత్నిస్తున్న పారిశ్రామికరంగంపై విద్యుత్‌ పిడుగు పడింది. శుక్రవారం నుంచే అమలుకు డిస్కంల అధికారులు చర్యలు చేపట్టారు. రానున్న రోజుల్లో ఇది ఇది ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈమేరకు భారత పరిశ్రమల శాఖ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. విద్యుత్‌ కోతలతో రాష్ట్రం అల్లాడిపోతోంది. పల్లె జనం కరెంటు లేక అల్లాడిపోతున్నారు. రోజులో ఎన్నిగంటలు ఉంటుందో..ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్ర తలసరి ఆదాయంలో వ్యవసాయం తరువాత ముఖ్య భూమిక పోషించే పారిశ్రామిక రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొన్నది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించింది. సాధారణంగా పరిశ్రమలు ఒక రోజు కార్మికుల కోసం సెలవులు ప్రకటిస్తాయి. దీనికి అదనంగా మరో రోజు ప్రకటించాలి. అంటే వారానికి రెండు రోజులు మూతపడనున్నాయి.

అదేవిధంగా నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు తాము వినియోగిస్తున్న విద్యుత్తులో కేవలం 50 శాతం మాత్రమే వాడుకోవాలి. ఇది ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు కరెంటు కోతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాలింతలు చంటి పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. టార్చి లైట్ల వెలుతురులోనే వైద్యం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియని కరెంటుతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో కరెంటు లేదు. ఉక్కపోతతో రోగులు అల్లాడి పోతున్నారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకూ కోతలు తప్పవని విద్యుత్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ కష్టాలు వెంటాడుతుంటే కృష్టా జిల్లాలో విద్యుత్‌ వృథా అవుతోంది. మచిలీపట్టణం పోతేపల్లి జ్యుయలరీ పార్కు వద్ద పట్టపగలే వీథి దీపాలు వెలుగుతున్నాయి. తెల్లవారి గంటలు గడుస్తున్నా విద్యుత్‌ వీధి దీపాలను ఆర్పేందుకు సిబ్బందే రాకపోవడం గమనార్హం. దీంతో జనం మండిపడుతున్నారు. మరోపక్క అక్కడే కరెంటు లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమల పరిస్థి ఇలా :

ఇక ప్రకాశం జిల్లాలో కరెంటు కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. గడచిన వారం రోజులుగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా గంటల కొద్దీ కోతలు విధిస్తున్నారు. అధికారికంగా ఫలానా సమయం అని ఎక్కడా చెప్పడం లేదు. కరెంటు ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో ఆయా ప్రాంతాల్లోని విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి కూడా పరిస్థితి అర్ధంకాని పరిస్థితి నెలకొంది. అనధికారిక విద్యుత్‌ కోతలు గ్రానైట్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. చీమకుర్తి, మర్రిచెట్లపాలెం ప్రాంతంలో సుమారు 700లకు పైగా ఫ్యాక్టరీల్లో వేలాదిగా ఉపాధి పొందుతున్నారు. కరెంటు కోతతో ఉత్పత్తికి బ్రేక్‌ పడుతోంది. కరెంటు లేక ఖాళీగా కూర్చోవల్సి వస్తోంది. ఈ పరిస్థితి యజమానులకు తలనొప్పిగా మారింది. ఐదు గంటలకుపైగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పవర్‌ హాలీడే గ్రానైట్‌ పరిశ్రమను సంక్షోభం దిశగా తీసుకెళ్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

గ్రానైట్‌ పరిశ్రమకు శరాఘాతమే..

- Advertisement -

చిన్న పరిశ్రమలు మార్కెటింగ్‌ లేక, ప్రొడక్షన్‌ లేక ఒక్క పూట మాత్రమే నడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ కోతలు విధిస్తే అదికూడా లేకపోతే తమకు ఆర్ధిక నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన రెండేళ్ల కాలంలో కోవిడ్‌ మూలంగా పరిశ్రమలు తెరచుకోలేదని, ఇప్పుడిప్పుడే ఆపరిస్థితుల నుండి బయటపడుతున్నారు. ఇప్పుడు విద్యుత్‌ వాడకంలో నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాలు అన్ని రకాల పరిశ్రమలు ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టేస్తాయని ఇవి తమక శరాఘాతమేనంటూ పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనా రుణాలు తీసుకున్నామని, వాటిని కట్టాలంటే కరెంటు కష్టాలు తప్పితేనే సాధ్యమవుతుందని వారు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. ఉన్న ఉద్యోగులంతా కంపెనీ ఉద్యోగులు కావడంతో వారికి పనిచేసినా, చేయకపోయినా వేతనాలు చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. అదే సమయంలో విద్యుత్‌ కోతలు విధించినా తమకు కనీస ఛార్జీలు తగ్గించరని నిర్వాహకులు చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాలో ఇలా …

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా (తిరుపతి, చిత్తూరు)లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. అటు- శ్రీసిటీ- పరిధిలో ఇప్పటికే 27 దేశాలకు చెందిన 185 పరిశ్రమలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత ప్రభుత్వం ఈఎంసీ-1, ఈఎంసీ-2 పేరుతో రేణిగుంట విమానాశ్రయ ప్రాంతంలో ఏర్పాటు- చేసింది. ఇక్కడ చరవాణుల ఉత్పత్తి సంస్థలతో పాటు- సీసీ కెమెరాలు, టీ-వీలు తయారు చేసే సంస్థలు ఉన్నాయి. శ్రీసిటీ-లో ఫాక్సాన్‌ పేరుతో చరవాణుల అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఉంది. డిక్సన్‌, సెల్కాన్‌, వింగ్లిక్‌ వంటి సంస్థలు ఉన్నాయి. ఒక్క ఫాక్సాకాన్లోనే 10 వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఇవన్నీ 24 గంటలపాటు- మూడు షిప్టnుల్లో పనిచేస్తాయి. ఈ పరిశ్రమలు కేవలం 50 శాతం విద్యుత్తును మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు సగానికి ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మూడు షిప్టులతో నడిచే పరిశ్రమలు సుమారు 300 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్థలు. ఇవీ ఇకపై సిబ్బందిని తగ్గించుకోవాల్సి వస్తుంది.

ప్రభుత్వానికి భారత పరిశ్రమల సమాఖ్య లేఖ..

రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్‌ సంక్షోభంపై భారత పరిశ్రమల సమాఖ్య శనివారం లేఖ రాసింది. అకస్మాత్తుగా పవర్‌ హాలీడే ప్రకటించడంతో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపింది. కోవిడ్‌ తరువాత కోలుకుంటున్న పరిశ్రమలకు మరోసారి ఇబ్బందులు మొదలయ్యాయని సీఐఐ లేఖలో స్పష్టంచేసింది. పారిశ్రామికవర్గాలతో చర్చించిన తరువాత నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫెరోఅల్లాయిస్‌, ఫార్మా, అగ్రి బేస్‌డ్‌ పరిశ్రమలకు పవర్‌ హాలీడేతో చాలా నష్టం జరగడంతోపాటు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 శాతం మేర ప్రభావితమవుతారని సీఐఐ తన లేఖలో ప్రభుత్వానికి తెలిపింది. విద్యుత్‌ సంక్షోభం ముదిరితే పరిశ్రమలు మూత పడటం ఖాయమని పేర్కొంది.

పరిశ్రమలు మూత పడటం ఖాయం : సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌ తిరుపతిరాజు..

రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటించిన విద్యుత్‌ కోతలు సరైన నిర్ణయం కాదు. ముందుగా దీనిపై సరైన కసరత్తు చేయకపోడం వల్లే ఈ పరిస్థితిలు నెలకొన్నాయి. దీనివల్ల పారిశ్రామికంగా ఎంతో నష్టం జరుగుతుంది. విద్యుత్‌ లేకుండా ఏ పరిశ్రమ కూడా నడవదు. అందులో కేటగిరైజేషన్‌ ఆఫ్‌ పవర్‌.. కింద కొన్నియూనిట్లు 24 గంటలు నడుస్తాయి. కొన్ని యూనిట్లకు ఈరోజు మెటీరియల్‌ ఇస్తే మూడు రోజుల తరువాత ప్రొడక్షన్‌ ఇస్తారు. ఇటువంటి దానిని షడన్‌గా ఆపేస్తే జరిగే పనికాదు. కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) తరపున విషయాలను ఛీఫ్‌ సెక్రటరీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.ఇప్పుడిప్పుడే కరోనా నుండి కోలుకుంటున్న పరిస్థితి నెలకొంది. అటువంటి పరిశ్రమల ఇండస్ట్రీపై దెబ్బవేస్తే కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా పరిశ్రమ తేరుకోలేకపోతే కార్మికులు రోడ్డుపాలవుతారు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపైన తీవ్ర ప్రభావం పడుతుంది. జనరేటర్‌ ఆన్‌చేస్తే యూనిట్‌కు రూ. 25 పడుతుంది. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 40 శాతం ప్రజల జీవన పరిస్థితి అస్థవ్యస్థంగా మారుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement