ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఎరువుల ధరలు వాటి ఉత్పత్తిపై ప్రభావం చూపించనున్నాయి. ఆసియాలో ఎరువుల ధరలు అధికంగా ఉన్నాయని దీని ప్రభావం వరి ధాన్యం ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపిస్తుందని, ఇది ఆహార సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే బియ్యం ఎగుమతిలో అగ్రస్థానంలో ఉన్న థాయిలాండ్‌లో ఈ సంవత్సరం దిగుబడులు తగ్గాయి. ఎరువుల ధరలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని ఒక పరిశోధన వెల్లడించింది. ఫిలిఫ్పైన్స్, చైనాలోనూ ఈ సారి దిగుబడులు తగ్గాయిని, భారత్‌లో వర్షాలపై ఆధారపడి దిగుబడులు ఉంటాయని ఈ పరిశోధన నివేదిక వెెల్లడించింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల గోధుమలు, మొక్కజొన్న ధరలు భారీగా పెరిగాయని, దీంతో ప్రత్యామ్నయంగా బియ్యం ప్రధాన ఆహారంగా ఉంది. సప్లయ్ సమస్యలతో ఇప్పటికే టన్నుకు 1000 డాలర్లకు పైగా గోధుమలు, మొక్కజొన్న ధరలు పెరిగాయని నివేదిక తెలిపింది. వీటి ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయ ఆహార పంటగా బియ్యానికి డిమాండ్ పెరుగుతుందని తెలిపింది.
భారత్ లో బియ్యం నిల్వలు తగినంతగా ఉన్నందున ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది రాదని ప్రముఖ ట్రేడర్ వి.సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. రైస్ ప్రధానంగా ఆసియాలోనే పండిస్తున్నారు. వినియోగం కూడా ఆసియలోనే ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశంలో ధరలు పెరగకుండా ఉండేందుకు ఇప్పటికే భారత్ గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. సప్లయ్ సమస్యల మూలంగా ఆహార భద్రత ప్రమాదంలో పడే సూచనలు ఉన్నాయని ఆ నివేదక ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎరువుల సరఫరా తగ్గిందని ఫలితంగా పంటల దిగుబడులపై ప్రభావం పడుతుందని ధాయిలాండ్‌లోని కోసికార్న్ పరిశోధనా సంస్థ అభిప్రాయపడింది. ఫిలిప్పైన్స్‌లోనూ అధిక ఎరువుల ధరల వల్ల వరి దిగుబడులు తగ్గుతాయని తెలిపింది. అక్కడి ప్రభుత్వం కూడా పెరుగుతున్న బియ్యం రేట్లపై ఆందోళన వ్యక్తం చేసిందని, సామాన్య, మధ్య తరగివారిపై ఇది మరింత భారం మోపుతుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. చైనాలో తెగుళ్ల తాకిడికి పంటల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. మరో ఎగుమతిదారు వియత్నాంలోనూ ఎరువుల ధరల వల్ల దిగుబడులపై ప్రభావం చూపుతుందని నివేదిక తెలిపింది. ఈ పరిస్థితుల్లో భారత్ నుంచి మాత్రమే భారీగా ఎగుమతులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సారి ఇక్కడ మంచి వర్షాలు పడితే దిగుబడులు పెరుగుతాయని, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బియ్యం సరఫరాలు తగినంతగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.