Friday, November 22, 2024

Big Story: సురక్షిత ప్రాంతాలకు 15వేల మంది తరలింపు.. పంచ్‌తర్నిలో ప్రత్యేక శిబిరాల్లో వసతి

మెరుపు వరదల కారణంగా అమర్‌నాథ్‌ గుహ సమీపంలో చిక్కుకుపోయిన 15వేల మంది యాత్రికులను శనివారంనాడు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరందరినీ అమర్‌నాథ్‌ మార్గంలోని పంచ్‌తర్నివద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి సముదాయానికి తీసుకువెళ్లారు. ఈ ప్రమాదంలో గాయపడిన 21మందికి బల్తాల్‌లో ప్రత్యేక హెలికాప్టర్లలో తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఉన్నట్టుండి కురిసిన కుంభవృష్టి కారణంగా అమర్‌నాథ్‌ గుహ సమీపంలో అకస్మాత్తుగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. వరద ప్రవాహం ధాటికి యాత్రికుల కోసం వేసిన శిబిరాల్లో కొన్ని కొట్టుకుపోగా మరికొన్ని ధ్వంసమైనాయి. ఈ ఘటనలో కనీసం 16మంది మరణించారు. మరో 40 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గాలింపు చర్యలు విస్తృతం చేశారు. ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయని, ఎక్కడా కొండ చరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకోలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరక్టర్‌ జనరల్‌ అతుల్‌ కర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతం అమర్‌నాథ్‌లో నాలుగు కేంద్ర విపత్తు నివారణ బృందాలు, 100మంది రక్షక సిబ్బంది సహాయక చర్యల్లో తలమునకలై ఉన్నారని చెప్పారు. మరోవైపు మెరుపు వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలకు చేరుకున్న చినార్‌ కార్ప్స్‌ కమాండర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏడీఎస్‌ అహుజ్లా, కాశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌, డివిజనల్‌ కమిషనర్‌ అక్కడి పరిస్థితిని పరిశీలించారు.

వరద నీటితో బండరాళ్లు

అమర్‌నాథ్‌లోని మంచులింగాన్ని దర్శించుకునేందుకు దాదాపు 15వేలమంది గుహ సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుని వేచి చూస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఉన్నట్టుండి కుంభవృష్టి మొదలైందని, జాగ్రత్తలు తీసుకునేలోగానే ఎగువ పర్వత ప్రాంతాలనుంచి జలరాశి కిందకు దుముకుతూ మీదకొచ్చేసిందని ప్రత్యక్ష సాక్షులు అధికారులకు వివరించారు. పెద్దపెద్ద బండరాళ్లు, మట్టితో వస్తున్న జలపాతాన్ని చూసి గుండెలదిరిపోయాయని, తప్పించుకునే అవకాశం కూడా లేకపోయిందని వారు చెప్పారు. చూస్తుండగానే కొన్ని శిబిరాలు కొట్టుకుపోయాయని, అందులోని యాత్రికులు గల్లంతయ్యారని, మరికొన్ని శిబిరాల్లోకి బురద, బండరాళ్లు వచ్చి పడ్డాయని వివరించారు. సామూహిక వంటకోసం ఏర్పాటు చేసిన శిబిరాలు ధ్వంసమైనాయని, చాలామంది గాయపడ్డారని తెలిపారు. సంఘటనా స్థలానికి సుమారు 2 కి.మి. దూరంలో ఉన్న యాత్రికుల శిబిరాలూ ఈ వరద ధాటికి దెబ్బతిన్నాయని తెలిపారు. భారీవర్షాలు కురుస్తున్నప్పటికీ అమర్‌నాథుడిని దర్శించుకునేందుకు భక్తులు వస్తూనే ఉన్నారని చెప్పారు. కాగా మరికొద్ది రోజులపాటు యాత్రను నిలిపివేస్తున్నట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌ కుమార్‌ పాండే చెప్పారు. కాగా శుక్రవారం సాయంత్రం 4.30 – 5.30 గంటల మధ్య 3.1 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అమర్‌నాథ్‌ గుహవద్ద ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రంలో నమోదైంది. గుహకు అతి సమీపంలోని బేస్‌క్యాంప్‌ వద్ద 25 శిబిరాలు కొట్టుకుపోయాయని, నాలుగు వంటశాలలు ధ్వంసమనాయని అధికారులు వివరించారు. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోవడంతో రెండేళ్ల తరువాత జూన్‌ 30న యాత్ర మొదలైంది. దీంతో పెద్దఎత్తున భక్తులు అమరనాథుడి దర్శనంకోసం తరలివచ్చారు. ప్రతికూల వాతావరణం, ఉగ్రముప్పు ఉన్నప్పటికీ వెరవకుండా శివదర్శనం కోసం బారులు తీరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement