కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నాగం జనార్దన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ కేటాయించలేదు. దీనిపై కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, జానారెడ్డి లాంటి నేతల దృష్టికి తీసుకెళ్లినా టికెట్ విషయంలో హామీ దక్కలేదు. కాగా, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు, రాజేష్ రెడ్డికి ఆకస్మికంగా కాంగ్రెస్ టికెట్ కేటాయించింది.
దీంతో ఆగ్రహానిక గురైన నాగం.. ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశంలో అనుచరులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. చివరకు తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు, ప్రజలకు నాగం స్పష్టత ఇచ్చారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో నాగం చేరుతారని తెలుస్తున్నది.