Tuesday, November 26, 2024

Spl Story | బీజేపీ నేత‌ల‌కు బిగ్ షాక్‌, ఎమ్మెల్సీ క‌విత విష‌యంలో సీన్ రివ‌ర్స్‌.. మైలేజీకి బ‌దులు బిగ్ డ్యామేజీ!

బీజేపీ తెలంగాణ లీడ‌ర్ల‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఎమ్మెల్సీ క‌విత విష‌యంలో వారి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. ఇంత‌కుముందే కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్య నేత‌ అమిత్‌షాతో జ‌రిగిన భేటీలో క‌విత అరెస్టు గురించి వారికి స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఉంద‌ని, అందుకే అవాకులు, చెవాకులు పేలిన‌ట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ‌లో ఒక్క‌సారిగా మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో క‌విత అరెస్టు కాకుండా కేంద్ర ఇంట‌లిజెన్స్ నివేదిక‌ల మేర‌కు ఇవ్వాల ఈడీ బ‌య‌ట‌కు పంపిన‌ట్టు స‌మాచారం..

– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిచింది. అయితే.. ఆమెను ఇవ్వాల (శనివారం) అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. ఈ విషయంలో బీజేపీ ఒక అడుగు ముందుకేసి మరీ విపరీతంగా ప్రచారం చేసింది. కవిత అరెస్ట్ తప్పదని బీజేపీ ఎంపీ, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ, ఈడీ అధికారులు మాత్రం అరెస్ట్ చేయలేదు. ఉదయం 11 గంటల నుంచి సుదీర్ఘంగా విచారించిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ).. రాత్రి 8 గంటల తర్వాత బయటికి పంపించింది. ఈ క్రమంలో అయిదుగురు అధికారుల బృందం ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి అన్ని కోణాల్లో విచారణ చేసినట్టు తెలుస్తోంది. ఇక.. అక్రమ నగదు రవాణా నిరోధక చట్టంలోని సెక్షన్ 50కింద కవిత వాంగ్మూలం నమోదు చేశారు.

ఈ విచారణలో ఇవ్వాల సాయంత్రం కీలక పరిణామ చోటుచేసుకుంది. పర్సనల్ ఫోన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవితను ఈడీ ఆదేశించింది. కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్ ను మాత్రమే ఇవ్వాలని అధికారులు చెప్పారు. కాగా, తన సెక్యురిటీ తో తెప్పించి ఈడీ అధికారులకు ఓల్డ్​ ఫోన్​ని అప్పగించారు. అనంతరం దాన్ని సీజ్ చేసినట్టు సమాచారం. ఇక.. ఈ కేసులో కవితను అరెస్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, సాయంత్రం అనూహ్య వాతావరణం ఏర్పడింది. కవితను ఈడీ అధికారులు ఇంటికి పంపించారు. దీంతో బీజేపీ నేతలు షాక్​కి గురయ్యారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రానికి ఇంటలిజెన్స్​ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణలో పరిస్థితి అదుపు తప్పుతుందని ఇప్పటికే కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల దగ్గర పక్క సమాచారం ఉంది.

- Advertisement -

అసలు కవిత అరెస్ట్ కు ఎప్పుడు భీజం పడిందంటే..
మార్చి నాలుగో తేదీన బీజేపీ హైకమాండ్ తో తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో.. తెలంగాణ నేతలు కిషన్ రెడ్డి , బండి సంజయ్ , ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి , ధర్మపురి అర్వింద్ , డీకే అరుణ , ఏపీ జితేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సమయంలో తాజా రాజకీయాలపై చర్చించారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను అరెస్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందని అమిత్ షా ఆరా తీసినట్టు సమాచారం. దీనికి బండి సంజయ్, కిషన్ రెడ్డి, అర్వింద్ మాత్రం.. కవితను అరెస్ట్ చేస్తే బీజేపీకి చాలా మైలేజ్ వస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కుటుంబం మీద చేసిన అవినీతి ఆరోపణలు నిజం చేసినట్టు అవుతుందని, కేసీఆర్ ది అవినీతి పాలన అని ప్రజలను నమ్మించవచ్చని వారు చెప్పినట్టు సమాచారం.

ఈ పరిణామం రాబోయే ఎన్నికలకు కూడా బాగా పనికి వస్తుందని, తెలంగాణలో అధికారంలోకి రావడానికి దీనికి మించిన ప్లాన్​ మరొకటి లేదని షాకు చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం. వారు చెప్పిన దానికి అమిత్ షా స్పందిస్తూ.. ‘‘ఓకే కవిత అరెస్ట్ అవుతుంది. 10వ తేదీన లేదంటే 11వ తేదీన కవితను ఈడీ అరెస్ట్ చేస్తుంది. దాన్ని తెలంగాణలో రాజకీయంగా బాగా వాడుకోవాలని అమిత్ షా సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ తెలంగాణ నేతలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అరెస్టు చేస్తే తప్పేంటన్న వాదనలు వినిపించడం చేసినట్టు సమాచారం

బెడిసికొట్టిన ప్లాన్?
ఇక.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి అమిత్​షా అనుకున్న ప్లాన్​ బెడిసికొట్టింది. కవిత అరెస్టు అయితే.. తెలంగాణలో పరిస్థితి వేరేగా ఉంటుందని ఇంటలిజెన్స్​ వర్గాలు సమాచారం ఇచ్చాయి. దీంతో కేంద్రానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇచ్చిన నివేదక తప్పు అని తేలింది. కవిత అరెస్ట్ సంగతి పెడితే.. ఈడీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో కంప్లీట్ గా బీజేపీకి డ్యామేజ్ తప్ప మరేం లేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో పెద్దగా ఆధారాలు లేకుండానే.. కేవలం రాజకీయ కక్షతోనే కవితను అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని బీఆర్​ఎస్​ ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లింది.

దేశ రాజకీయాల్లోకి వెళ్లకుండా కేసీఆర్ ను నిలువరించేందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఆ వైపుగా బీఆర్ఎస్ తీవ్రంగా కృషి చేసింది. ఇప్పుడు కనుగా కవితను అరెస్ట్ చేస్తే.. బీజేపీకి రాజకీయంగా ఎలాంటి లాభం జరగకపోగా.. బీఆర్ఎస్ కు ప్రజల నుంచి మరింత మద్దతు పెరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని బీజేపీ అధిష్టానానికి కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఒక స్పష్టమైన నివేదిక ఇచ్చాయి. దీంతో కంగుతిన్న బీజేపీ హైకమాండ్ రూటు మార్చుకుంది. అందుకనే కవితను విచారించి వదిలేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేదని అమిత్ షా భావించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు ఇచ్చిన నివేదికకు, ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికకు ఏమాత్రం పొంతన లేదు. దాంతో కవిత అరెస్ట్ పై ఈడీ వెనక్కి తగ్గేలా ఆదేశాలు జారీ చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.

అదే మీటింగ్​లో ఈటలకు అమిత్ షా వార్నింగ్​?
మొన్న‌టి నాలుగో తారీఖున జరిగిన మీటింగ్ లో ఈటల రాజేందర్ పై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పార్టీ వెనకాల ఉన్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందరే అన్న విషయం అమిత్ షా కు తెలిసింది. ఇదే విషయాన్ని కార్నర్ చేస్తూ ఈటల రాజేందర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట అమిత్ షా. మీరు చేరికల కమిటీ చైర్మన్ గా ఫెయిల్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి పెద్ద తలకాయలను లాగలేకపోయారు. పైగా పార్టీ కోసం కష్టపడాల్సింది పోయి.. ఇతరులతో కలిసి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారా? ఇందుకేనా మీరు బీజేపీలోకి వచ్చింది అంటూ ఈటల మీద షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలంగాణ బీజేపీ నుంచే లీకులు బయటకు వచ్చాయి.

అందుకే.. ఈటల కూడా ఢిల్లీకి పోయి వచ్చాక సైలెంట్ అయిపోయారు అనే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ వారం పది రోజుల నుంచి పెద్దగా రాజకీయ సభల్లోనూ ఎక్కడ అంతగా యాక్టివ్ గా లేరు. ఇంతకాలం బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్న ఈటల.. ఈ పరిణామంతో పెద్ద దెబ్బ ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ఏంటీ అనే దానిపై తర్జన భర్జన ప‌డుతున్న‌ట్టు స‌మాచారం.

ఈ నెల 16న మరోసారి విచారణ.. ఆ రోజు అరెస్ట్?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ఇవ్వాల అరెస్ట్ అవుతుందని అంతా భావించారు. మీడియాలో కూడా అదే హడావిడి కనిపించింది. కానీ, కవితను ఈడీ అరెస్ట్ చేయలేదు. అయితే ఈ నెల 16న మరోసారి తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఒకవేళ కవితను ఆరోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement