గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే పరేడ్ లో త్రివిధ దళాల బల ప్రదర్శనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు, సైనికుల కవాతు, వైమానిక దళాల విన్యాసాలు, నృత్య ప్రదర్శనలు, జానపద పాటలు, భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని తెలిపే కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా సాగుతుంది.
ఈ పరేడ్ ను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఢిల్లీకి వెళుతుంటారు. జనవరి 26న ఉదయం 9:30 గంటలకు విజయ్ చౌక్ నుంచి మొదలయ్యే కవాతు 5 కిలోమీటర్లకు పైగా సాగి నేషనల్ స్టేడియం వద్ద ముగుస్తుంది. ఈ పరేడ్ కు హాజరయ్యేందుకు తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాలి.
ఆన్లైన్లో …
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆమంత్రన్ ఆన్లైన్ పోర్టల్ లేదా ఇన్విటేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి లాగిన్ కావాలి. పేరు, పుట్టిన తేదీ, చిరునామాలను నమోదు చేయాలి. జాబితాలో సూచించిన మేరకు మీ గుర్తింపు కార్డును అప్ లోడ్ చేయాలి. ఆపై ఆన్ లైన్ లో నిర్ణీత మొత్తం చెల్లిస్తే టికెట్ పొందవచ్చు. ఆ తర్వాత టికెట్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
ఆఫ్లైన్లో..
ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఢిల్లీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కౌంటర్లతో పాటు ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో రిపబ్లిక్ డే పరేడ్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. టికెట్ కొనుగోలు చేసేందుకు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.