Friday, November 22, 2024

Big Fight – వార‌ణాసిలో శిఖండీ! మోదీపై బరిలోకి ట్రాన్స్ జెండర్

నరేంద్ర మోదీపై మరో నయా అస్త్రం
ఆచార్య మహా మండలేశ్వరీ హేమాంగి సఖీ మాత పోటీ
ఆప్.. ఎస్పీ ఓట్లకు చిల్లు
ఆర్ఎస్ఎస్ శిఖండి వ్యూహం

ఆంధ్రప్రభ స్మార్ట్, వారణాసి ప్రతినిధి) వార‌ణాసి లోక్‌స‌భ స్థానంలో అప్రతిహాత విజేయుడి చరిత్ర కోసం తపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఓ ట్రాన్స్‌జెండ‌ర్ పోటీ చేస్తున్నారు. ఆమె కూడా హిందూ అస్త్ర‌ శస్త్రాలతో బరిలోకి రావటం విశేషం. అంతే కాదు, ప్రధాని మోదీ జన్మస్థలి గుజరాతీ యోధురాలు కావటం మరో గొప్ప అంశం. అటు భక్తుల బలగంతో, ఇటు ఆర్థిక బలంలో తన యుద్ధ రథాన్ని సవారీ పరుగులు పెట్టించే ధీర. అందుకే ప్రధాని మోదీపై ప్రధాన ప్రతిపక్ష పార్టీల యుద్ధం నామమాత్రంగానే భావిస్తుంటే.. మరి ఈ అభినవ శిఖండి.. ఈ నయా భీష్ముడిని ఎలా ఎదుర్కొంటుంది. ఎలా ఢీకొంటుంది? అసలు ఈమె గెలవాలంటే శివుడి వరం పొంది ఉండాలి, పైగా మోదీ అస్త్ర‌ సన్యాసం చేయాలి. ఇవీ ప్రస్తుతం వారణాసిలో జనంలో చర్చనీయాంశ ప్రశ్నలు.

ఎవరీ బంగారు సఖీ

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హేమాంగి సఖీ మాత, అఖిల భార‌త హిందూ మ‌హాస‌భ నేత. గుజ‌రాత్ లోని వడోదరలో జ‌న్మించారు. ఆమె ప్రపంచంలోనే భ‌గ‌వ‌ద్గీత‌ను బోధిస్తున్న తొలి ట్రాన్స్‌జెండ‌ర్‌గా గుర్తింపు పొందారు. 2019లో ఆచార్య మ‌హామండ‌లేశ్వర్‌గా ప‌ట్టాభిషిక్తుల‌య్యారు. కాగా, ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్.. ప్రస్తుతం ముంబ‌యిలో ఉన్నారు. గొప్ప ఆధ్యాత్మికపరురాలిగా ఆమె బరిలోకి దిగటంతో.. హిందుత్వ నినాదమే ఊపిరిగా ముందుకు సాగుతున్న బీజేపీకి హేమాంగి సఖీ దెబ్బ తప్పదు.

ఆప్.. ఎస్పీలకే పెద్ద దెబ్బ
ఇక ఇప్పటివ‌ర‌కు రెండు ఎన్నికల్లోనూ మోదీకి ప్రధాన పోటీదారులుగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ లౌకిక భావజాలంతో ముందుకు సాగాయి. హిందుత్వ నినాదం బీజేపీకి వరంలా పనిచేసింది. 1991 నుంచి వారణాసి బీజేపీకి కంచుకోటగా మారిపోయింది. ఇక్కడి హిందూజనం కమలం గుర్తుకే కట్టుబడిపోయారు. 2004లో మాత్రం బీజేపీ చేజారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్ కుమార్ మిశ్రా 57 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి శంకర్ ప్రసాద్ జైశ్వాల్ పై విజయం సాధించారు. ఈ విధంగా జైశ్వాల్ జైత్రయాత్రకు గండి పడింది. ఆ త‌ర్వాత 2009 మురళీమనోహర్ జోషీ విజయం సాధించి బీజేపీకి పునరుత్తేజం తెచ్చారు. ఇక 2014లో మోదీ మాటల హావభావాలకు వారణాసి ఓటర్లు ఫిదా అయ్యారు. 2014లో మోదీ 3,71,784 మెజారిటీతో విజయం సాధిస్తే.. 2019లో ఈ మెజారిటీ 4,79,505ఓట్లకు చేరింది. ఇక 2024లో ఈ మెజారిటీ మరింత పెరుగుతుందని కమలనాథుల అంచనా. కానీ ..దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. ఈ ఓటు బ్యాంకుతోనే అసలు సిసలు ఇబ్బంది.

ఆర్ఎస్ఎస్ వ్యూహమే!

- Advertisement -

ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్ధిని పెట్టడం, అందులోనూ హేమాంగి సఖి మాత ముందుకు రావడంతో ఆస‌క్తిక‌ర చర్చ జరుగుతోంది. బీజేపీ భావజాలంతోనే హిందూ మహా సభ ఉన్నా ఎందుకు మోదీ పైనే పోటీ పెడుతోంది అన్నది కూడా చ‌ర్చకు దారితీసింది. కానీ, ఇందులో మరో కోణం కూడా ఉంది. హిందువుల్లో మోదీ వ్యతిరేక ఓటు బ్యాంకును కొల్లగొట్టటానికే ఆమెను బరిలోకి ఆర్ఎస్ఎస్ ప్రయోగించినట్టు మరో కథనం వినిపిస్తోంది. ఎందుకంటే.. వారణాసిలో బీజేపీ ప్రభావం తగ్గినట్టు కనపడకూడదు. హిందుత్వం సజీవమే.. వారణాసి ప్రజలు హిందుత్వానికే ఓటు వేస్తారు, లౌకిక శక్తులకు కాదు.. అనే చరిత్రను తెరమీదకు తీసుకువచ్చేందుకే ఆర్ఎస్ఎస్ వ్యూహం పన్నినట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement