హర్యానాలో జరిగిన అల్లర్లు, ఘర్షణల వెనక ఏదో కుట్ర కోణం దాగి ఉందని ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. సోమవారం నుహ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటన దురదృష్టకరమని, దీని ద్వారా అనేక చోట్ల ఘర్షణలు జరిగాయని, ఈ హింస వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం ఖట్టర్ ఇవ్వాల (మంగళవారం) మీడియాతో అన్నారు. సోమవారం జరిగిన ఘర్షణల తర్వాత కాల్పుల్లో ఇద్దరు హోంగార్డులతో సహా మొత్తం ఐదుగురు చనిపోయారు.
ఇది దురదృష్టకర సంఘటనగా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు యాత్రికులు, పోలీసులపై దాడికి కుట్ర పన్నారన్నారు.. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. నుహ్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. నుహ్ జిల్లా, దాని సమీప ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించారు.
నుహ్తోపాటు కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. దీనికి సంబంధించి 44 కేసులు నమోదు అయ్యాయి. 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణల నేపథ్యంలో గురుగ్రామ్‌లోని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలు మూసివేశారు. మృతి చెందిన హోంగార్డులు నీరజ్, గురుసేవక్‌గా గుర్తించారు.