పటాన్ చెరు : పటాన్ చెరు పారిశ్రామికవాడలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని ఓ స్క్రాప్ గోదాంలోనీ రసాయనాలు నిలువచేసే ప్లాస్టిక్ ట్యాంక్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దట్టమైన పొగతో పెద్ద ఎత్తున మంటలు విస్తరించాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో పారిశ్రామికవాడలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తును చేపట్టారు.
‘మైలాన్’ పరిశ్రమ ఘటన మరువకముందే…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పరిధిలోని ‘మైలాన్’ పరిశ్రమలో ఈ నెల 8వ తేదీన ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ముగ్గురు కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన మరువకముందే మరోసారి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
భయాందోళనలో స్థానికులు
పటాన్ చెరు పారిశ్రామికవాడలో నిత్యం భయంతో బ్రతుకుతున్నామని స్థానికులు తెలిపారు. ఎప్పుడు ఏ మూలన ఏ ప్రమాదం సంభవిస్తదో తెలియక అయోమయంలో మా పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణం ఈ పరిశ్రమలలో ఏర్పాటు చేసిన గోదాములపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.