చండీగడ్ – లోక్ సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమిలో ఐక్యతాలోపం బయటపడుతోంది. పశ్చిమబెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకోదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తు లేకుండానే మొత్తం 13 లోక్ సభ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని చెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ క్లీన్ స్వీప్ చేస్తుందని. మొత్తం 13 స్థానాలను గెలుచుకుంటుందని మాన్ ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్ లో ఘన విజయం సాధించి యావత్ దేశంలోనే ఆప్ హీరోగా నిలుస్తుందని చెప్పారు. 13 లోక్ సభ స్థానాలకు గాను దాదాపు 40 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశామని తెలిపారు. ప్రతి సీటుపై సర్వే నిర్వహిస్తామని షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్ ఇస్తామని చెప్పారు. సిట్టింగ్ ఎంపీలకు మాత్రం మళ్లీ టికెట్ కేటాయిస్తామని తెలిపారు.