Friday, November 22, 2024

రేపుఇజ్రాయెల్‌కు బైడెన్‌.. హమాస్‌తో పోరాటంపై ఆరా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌లో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు అమెరికా విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ మంగళవారమిక్కడ ఒక ప్రకటన చేశారు. జో బైడెన్‌ తన పర్యటన లో భాగంగా ప్రాణ నష్టాన్ని తగ్గించే మార్గంలో హమాస్‌పై ఇజ్రాయెల్‌ ఏ తీరుగా దాడులు చేస్తున్నదనే వైనాన్ని స్వయంగా తెలుసుకుంటారు.

అదే సమయంలో హమాస్‌కు ఎలాంటి లబ్ది చేకూరని విధంగా గాజాలో పౌరులకు మానవీయ సాయం అందడానికి మార్గం సుగమం చేస్తున్న తీరు గురించి ఆయన వాకబు చేస్తారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును బైడెన్‌ పునరుద్ఘాటిస్తారు. అదే సమయంలో కనీసం 30 మంది అమెరికన్లతో పాటుగా 1,400 మందికిపైగా ఇజ్రాయెల్‌ పౌరులను పొట్టనపెట్టుకున్న తర్వాత కూడా హమాస్‌ సాగిస్తున్న నరమేథాన్ని ఆయన ఖండిస్తారని బ్లింకెన్‌ తెలిపారు.

ఐరాసలో వీగిపోయిన కాల్పుల విరమణ తీర్మానం

- Advertisement -

ఐక్యరాజ్యసమితి: హమాస్‌ పేరెత్తకుండానే ఇజ్రాయెల్‌, గాజాల మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమతి(ఐరాస) భద్రతా మండలి సోమవారం రాత్రి ఓటింగ్‌ కోసం ప్రవేశపెట్టినతీర్మానం వీగిపోయింది. రష్యా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పలు అరబ్‌ దేశాల మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మానం సభ్యుల మధ్య కొరవడిన ఏకాభిప్రాయం కారణంగా ఓడిపోయింది.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ తీర్మానాన్ని చేపట్టడానికి అవసరమైన తొమ్మిది ఓట్లు కూడా రాని కారణంగా వారి వ్యతిరేక ఓటు లెక్కలోకి రాకుండా పోయింది. జపాన్‌ సైతం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.

కేవలం రష్యా, చైనా, మొజాంబిక్‌, గబోన్‌, యూఏయీ మాత్రమే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌పైన వేలకొద్దీ రాకెట్లతో దాడి 1,700 మందిని పొట్టనపెట్టుకున్న హమాస్‌ టెర్రరిస్టు గ్రూప్‌ను తీర్మానంలో ప్రస్తావించకపోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement