Friday, November 22, 2024

జిన్‌పింగ్‌కు బైడెన్‌ ఫోన్‌ – ఆర్థిక వివాదాలు, యుద్ధంపై చర్చ!

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం తారా స్థాయికి చేరుకున్న వేళ.. ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు వైట్‌ హౌస్‌ అధికారులు వెల్లడించారు. వీరిద్దరు.. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాలతో పాటు రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంపై కూడా చర్చించినట్టు సమాచారం. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు చైనా సహకరిస్తోందని గతంలో బైడెన్‌ ఆరోపించిన నేపథ్యంలో.. తాజా ఫోన్‌ కాల్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపర్చుకునేందుకు మాత్రమే దేశాధినేతలు మాట్లాడుకున్నారని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి.

రష్యాకు చైనా సాయం చేస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే బైడెన్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇటలీలోని రోమ్‌లో అమెరికా, చైనా విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. రష్యాతో చైనా పారదర్శకంగా వ్యవహరించాలని అమెరికా సూచించింది. సాయం చేయాలని చూస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చైనాకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement