హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణకు ఇచ్చిన ఒక్క ఎయిమ్స్ ను కూడా కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఎయిమ్స్ లో ఇప్పటి వరకు ఒక్క ఆపరేషన్ కూడా జరగలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో కొరవడ్డాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం బీబీ నగర్ ఎయిమ్స్ ను మంత్రి సందర్శించారు. ఇంత వరకు పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లను నియమించలేదన్నారు. 185 మంది ప్రొఫెసర్లు అవసరం ఉండగా 95 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. నర్సింగ్ నియామకాల్లోనూ నిర్లక్ష్యం రాజ్యమేలుతోందన్నారు. నర్సింగ్‌కు 812 పోస్టులు ఉండగా… 200 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఎయిమ్స్ కు 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ఇంత వరకు కొత్త భవన నిర్మాణం కాలేదన్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు జరగకపోవడం దారుణమన్నారు. ఎయిమ్స్ లో జరుగుతున్న లోటుపాట్లను కేంద్ర వైద్యశాఖకు నివేదిక రూపంలో వివరిస్తామన్నారు.
ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కిషన్‌రెడ్డికి ఏ మాత్రం బాధ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మాటలు చెప్పడం తప్ప చేతలకు పనికిరారని విమర్శించారు. వాళ్ల పనితీరు ఎలా ఉందో ఎయిమ్స్ కు వచ్చి చూస్తే అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ కు భూ బదలాయింపు చేయలేదని కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఎయిమ్స్ కు భూ బదలాయింపు జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం కాగితాలతో సహా రుజువులు చూపించే సరికి కిషన్‌రెడ్డి నాలుక కరుచుకున్నాడని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎయిమ్స్ లో చదువుతున్న 212 మంది వైద్య విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని , కేంద్ర ప్రభుత్వం ఎందుకింత అలసత్వం ప్రదర్శిస్తుందో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఇంత పెద్ద ఎయిమ్స్ లో 20 మంది ఇన్ పేషెంట్లు మాత్రమే ఉండటం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ నిర్మించిన సూర్యాపేట, నల్గొండ మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయో ఓసారి వెళ్లి చూడాలని బీజేపీ నేతలకు సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..