న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బీసీల జనాభా అత్యధికంగా 60 శాతం మించి ఉన్న భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే పోటీ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నేత శివరాజ్ గౌడ్ అన్నారు. శనివారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తర్వాత భువనగిరిలో బీసీ నేత ఎమ్మెల్యే కాలేదని, అక్కడ బీసీలకు టికెట్లు రాకుండా కుట్రలు, కుయుక్తులు చేస్తున్నారని శివరాజ్ ఆరోపించారు.
గత 4 దశాబ్దాలుగా బీసీలకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం రెండు బీసీలకు ఇస్తామని రాష్ట్ర నాయకత్వమే చెప్పిందని, ఆ లెక్కన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ సీటు బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లికార్జున ఖర్గేతో కూడా ఇదే విషయం చెప్పానని, బీసీలకు సముచిత ప్రాతినిథ్యం, ప్రాధాన్యత ఉంటుందని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు.
భువనగిరిలో కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ లో చేరిన అనిల్ కుమార్ రెడ్డి తాజాగా మైనంపల్లి హానుమంతరావుతో పాటు వచ్చి కాంగ్రెస్‌లో చేరడంపై నియోజకవర్గం కార్యకర్తల్లో గందరగోళం నెలకొందని అన్నారు. ప్రజలు కూడా తరచుగా పార్టీలు మారేవారిని విశ్వసించరని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ టికెట్ తనకే ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.