Saturday, November 23, 2024

రాహుల్‌తో భూపిందర్‌ హుడా భేటీ, జి-23 సమవేశం గురించి చర్చ

కాంగ్రెస్‌ ”జి-23” లేదా తిరుగుబాటు గ్రూపు సమావేశం తర్వాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా గురువారం రాహుల్‌ గాంధీని కలిశారు. హర్యానాలో పార్టీ పరిస్థితిని ఈ సందర్భంగా ఆయన రాహుల్‌కు వివరించారు. రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై చర్చించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ కుటుంబంపై జి23 నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆ వర్గం నుంచి గాంధీ కుటుంబ సభ్యులతో భేటీ అయిన మొదటి నాయకుడు హుడానే. ముఖ్యంగా జీ 23 నేతలు మాట్లాడుకున్న విషయాలే వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయని ఢిల్లి వర్గాలు పేర్కొంటున్నాయి. రా రాహుల్‌తో భేటీ అనంతరం పార్టీ సహచరుడు ఆనంద్‌ శర్మతో కలిసి రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ను హుడా కలిశారు. పార్టీ పరిస్థితులు, అధిష్ఠానం దృష్టికోణాన్ని హుడా ఈ ఇద్దరికీ వివరించినట్లు తెలుస్తోంది. అయితే భూపేందర్‌ సింగ్‌ నడిపిన రాయబారం సఫలమైనట్లే తెలుస్తోంది.

అతి త్వరలోనే గులాంనబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాతో భేటీ కాబోతున్నారని సమాచారం. కాగా, ఐదు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని అధ్యయనం చేయడానికి అధిష్ఠానం ఐదుగురిని నియమించింది. రజనీ పాటిల్‌ (గోవా), జయరాం రమేశ్‌ (మణిపూర్‌), అజయ్‌ మాకెన్‌ (పంజాబ్‌), జితేంద్ర సింగ్‌ (యూపీ), అవినాశ్‌ పాండే (ఉత్తరాఖండ్‌). వీరికి ఈ రాష్ట్రాల బాధ్యతలను అప్పగించింది. దీని తర్వాత సీనియర్‌ నేత ఆజాద్‌ అధ్యక్షురాలు సోనియాతో భేటీ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక జి23 సూచనలతో రాహుల్‌ ఏకీభవించారని పార్టీ వర్గాలు తెలిపాయి. హర్యానా కాంగ్రెస్‌ పగ్గాలను తనకు లేదా తన కుమారుడు దీపిందర్‌ హుడాకు ఇవ్వనందుకు భూపిందర్‌ హుడా అధిష్టానంపై అసహనంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు గాంధీలకు సన్నిహతురాలిగా భావిస్తున్న సెల్జా కుమారితో హుడా వైరంలో కూరుకుపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement