భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) అదనపు జనరల్ మేనేజర్ రాంచీలోని క్యాపిటల్ హిల్ హోటల్లో శవమై కనిపించారు. మృతుడు మనోజ్ సింగ్‌గా గుర్తించారు పోలీసులు. కాగా అతను గుండెపోటుతో చనిపోయినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. హోటల్లో బస చేసిన వ్యక్తి చనిపోయాడని హోటల్ యాజమాన్యం పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని విచారించగా.. రూమ్ నెంబర్ 209లో ఉంటున్న మనోజ్ కుమార్ సింగ్ గది ఉదయం నుంచి తెరవలేదని తేలింది.
మరో గదిలో ఉంటున్న అతని స్నేహితుడు డూప్లికేట్ తాళం వేసి గదిని తెరవాలని హోటల్ మేనేజర్ని కోరాడు. గది తెరిచి చూసేసరికి మంచంపై మనోజ్ సింగ్ మృతదేహం పడి ఉంది అని హింద్పిరి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వినయ్ సింగ్ చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. 56 ఏళ్ల మనోజ్ సింగ్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు.