Wednesday, November 27, 2024

భ‌ట్టికి విష‌య ప‌రిజ్ఞానం ఎక్కువ‌.. : కేసీఆర్‌ కితాబు

  • తెలంగాణ అసెంబ్లీలో అరుదైన స‌న్నివేశం
  • విప‌క్ష నేత విక్ర‌మార్క‌పై సీఎం ప్ర‌శంస‌లు

మధిర : ఏ చ‌ట్ట స‌భ‌లోనైనా అధికార ప‌క్షంపై విప‌క్షం దాడి, విప‌క్షంపై అధికార ప‌క్షం ఎదురు దాడి జ‌రుగుతుంది. అయితే అందుకు విరుద్ధంగా విప‌క్ష నేత‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ అధికార ప‌క్ష నేత వ్యాఖ్య‌లు చేయ‌డం దాదాపుగా అరుదు. అలాంటి అరుదైన స‌న్నివేశం తెలంగాణ బ‌డ్జెట్ ముగింపు సమావేశంలో చోటు చేసుకుంది.
మధిర శాసనసభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పై ముఖ్యమంత్రి కేసీఆర్ కురిపించిన ప్రశంసల జల్లు రాజకీయ చైతన్యవంతమైన మధిర నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మంగళవారం అసెంబ్లీలో
మ‌న ఊరు- మ‌న బ‌డిపై భ‌ట్టి చేసిన సానుకూల వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించిన భ‌ట్టిపై కేసీఆర్ ప్ర‌శంస‌లు కురిపిస్తూ
భ‌ట్టిని పార్ల‌మెంటుకు పంపాల‌ని సూచన చేశారు.

ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై ప్రసంగించిన సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ మన ఊరు- మన బడి కార్యక్ర‌మంపై సానుకూల వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్ త‌న ప్ర‌సంగంలో ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘భట్టి విక్రమార్క మన ఊరు మన బడి మంచిది అని చెప్పారు. భట్టి ఈ సారి ఓ మంచి మాట చెప్పారు. భట్టికి ప్రమోషన్ ఇవ్వాలి. పార్లమెంట్ కి పంపాలి’ అని కేసీఆర్ అన్నారు.
జాతీయ స్థాయి అంశాల‌పై భ‌ట్టి కాస్తంత గ‌ట్టిగానే కాకుండా అవ‌గాహ‌న‌తో మాట్లాడుతున్నార‌ని, అందుకే ఆయ‌న‌ను పార్లమెంట్‌కు పంపాల‌ని తాను అంటున్నాన‌ని కేసీఆర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. విప‌క్ష నేత‌పై కేసీఆర్ ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో స‌భ‌లో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం క‌నిపించింది. రాష్ట్ర రాజకీయాల్లో తరచుగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్ష నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను పొగడటం స్థానిక టిఆర్ఎస్ నాయకత్వాన్ని నిరాశకు గురి చేసిందని టిఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 లో సైతం రాష్ట్రంలో రెండే రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని అందులో మధిర నియోజకవర్గం ఒకటని కెసిఆర్ చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ నాయకులు మాత్రం భట్టి విక్రమార్క గొప్ప మేధావి అని, సాక్షాత్తూ ముఖ్యమంత్రే దీనిని అంగీకరించార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement