Tuesday, November 26, 2024

TG | విజయవంతంగా ముగిసిన భట్టి విక్రమార్క విదేశీ టూర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని డిప్యుటీ సీఎం భట్టి శుక్రవారంనాడు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పర్యటన ఫలప్రదమైంది. పెద్ద ఎత్తున పరిశ్రమాలతో ఒప్పందాలు, స్థాపనకు ఈంగీకారాలతో ఆయన స్వదేశానికి రానున్నారు. గత నెల 24న ప్రారంభమైన డిప్యుటీ సీఎం భట్టి అమెరికా, జపాన్‌ దేశాల అధికారిక పర్యటన గురువారంతో విజయవంతంగా ముగిసింది.

మొత్తం మీద రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆయనతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం జరిపిన పర్యటన రాష్ట్ర విద్యుత్‌ రంగంలో అత్యాధునిక గ్రీన్‌ ఎనర్జీ ఉత్పాదనకు, సింగరేణిలో రక్షణతో కూడిన అధికోత్పత్తి మైనింగ్‌ పద్ధతుల ఆచరణకు ఊతం ఇవ్వనుంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు డిప్యూటీ సీఎం అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకోనుంది.

ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పి.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, సింగరేణి సిఎండీ ఎన్‌.బలరామ్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. రెండు దేశాల ఈ పర్యటనలో ప్రధానంగా అంతర్జాతీయంగా ఉనికిలోకి వచ్చిన అత్యాధునిక గ్రీన్‌ ఎనర్జీ టెక్నాలజీలు, ఆధునిక మైనింగ్‌ విధానంలో అధికోత్పత్తిని సాధించే భారీ యంత్రాలు, వర్చువల్‌ రియాలిటీతో రక్షణ చర్యలు మొదలైనవి స్వయంగా పరిశీలించడమే కాక వీటిని రాష్ట్రంలో అమలు జరపడానికి శ్రీకారం చుట్టారు.

అమెరికాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్‌ ఎగ్జిబిషన్‌ మైనెక్స్‌-2024లో కోమత్సు ,హిట్యాచి, క్యాటర్‌ పిల్లర్‌ వంటి ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేసిన అత్యాధునిక షావెల్స్‌, డంపర్లు, కంటిన్యూయస్‌ మైనర్‌ యంత్రాలు, గనిలో ప్రమాదాలు జరగకుండా చూసే రక్షణ వ్యవస్థలను పరిశీలించారు. ముఖ్యంగా భూగర్భ గనుల్లో వర్చువల్‌ రియాలిటీ ద్వారా గని వెలుపలే ఉండి లోపల బొగ్గును తవ్వే సాంకేతికత ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సింగరేణి సంస్థ ఈ తరహా అత్యధిక బొగ్గు ఉత్పత్తిని సాధించే ఆధునిక యంత్రాలను సమకూర్చుకోవాలని, ప్రమాదరహిత సింగరేణిగా సంస్థను రూపుదిద్దడానికి ఆధునిక రక్షణ సాంకేతికతను అమలు చేయాలని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా సింగరేణి సిఎండీ ఎన్‌.బలరామ్‌ ను కోరారు. అమెరికాలో అతిపెద్ద హూవర్‌ జల విద్యుత్‌ డ్యామ్‌ను సందర్శించిన సందర్భంగా అక్కడ అమలవుతున్న జల విద్యుత్‌ ఉత్పత్తి విధానాలు, రక్షణ చర్యలు తెలంగాణలో కూడా అమలు జరపాలని ఆయన ఎనర్జీ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ను కోరారు.

- Advertisement -

జపాన్‌ పర్యటనలో యమనాషీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ కేంద్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి వినియోగించే సాంకేతికతను, సోలార్‌ విద్యుత్తును నిలువ ఉంచే ఫ్యూయల్‌ సెల్స్‌ టెక్నాలజీని పరిశీలించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి చేపట్టనున్న నేపథ్యంలో ఈ రెండు పద్ధతులపై దృష్టి సారించాలని, తెలంగాణలో గ్రీన్‌ హైడ్రోజన్‌ టెక్నాలజీ వృద్ధికి యమనాషీ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు.

అలాగే తోషిబా పరిశ్రమలను సందర్శించి అక్కడ ఉత్పత్తి అవుతున్న అత్యాధునిక ఫోటోవోల్టాయిక్‌ మాడ్యూల్స్‌ తయారీ టెక్నాలజీని పరిశీలించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఫోటో వోల్టాయిక్‌ మాడ్యూల్స్‌ అవసరం ఎంతో ఉంటుందని, అలాగే అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ర్‌ బస్సులుగా మార్చే ఉద్దేశం ఉన్నందున ఫ్యూయల్‌ సెల్స్‌ ఆవశ్యకత కూడా ఉంటుందని భట్టి పేర్కొన్నారు.

తోషిబా వారిని రాష్ట్రంలో ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ, స్వయంగా గానీ ఫ్యూయల్‌ సెల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. అలాగే రోహ్మ్‌ సెమీ కండక్టర్ల పరిశ్రమను సందర్శించి అక్కడ జరుగుతున్న పలు రకాల సెమీకండక్టర్‌లు, హై ఎఫిషియన్సీ బ్యాటరీలు, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ సెమీకండక్టర్లు వంటివి పరిశీలించారు.

సోలార్‌ విద్యుత్‌కు, ఇతర ఆధునిక పరిశ్రమలకు ఈ అత్యాధునిక సెమీకండక్టర్ల ఆవశ్యకత ఉన్నందున ఈ తరహా పరిశ్రమను తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయాలని వారిని ఆహ్వానించారు. అలాగే పానాసోనిక్‌ కంపెనీ వారితో కూడా ఆధునిక ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలపై చర్చించారు.

జపాన్‌ రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న బుల్లెట్‌ ట్రైన్‌లో ఆయన స్వయంగా ప్రయాణించారు. అత్యంత వేగంతో ప్రయాణించే ఈ తరహా ట్రైన్‌లను రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రైల్వే శాఖకు విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement