న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇప్పటికే నిర్మించిన కాళేశ్వరం సహా కొత్తగా కడుతున్న సీతారామ సాగర్ వంటి అశాస్త్రీయ ప్రాజెక్టుల కారణంగానే వరద ముంపు పెరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తబోయే అంశాల గురించి చెప్పారు. ప్రాజెక్టుల కారణంగా పొలాలకు నీళ్లు రాకపోగా, వరద ముంపునకు గురయ్యాయని అన్నారు. ఇంజనీరింగ్ నిపుణులు రూపొందించిన డిజైన్లను కాదని, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు స్వయంగా డిజైన్లు రూపొందించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
డిజైన్ లోపాలతో రిటెయినింగ్ వాల్ నిర్మాణం లేకపోవడం గతంలో ఎప్పుడూ వరద ముంపు లేని గ్రామాల్లోకి సైతం వరద నీరు వచ్చి చేరిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకుంటే, వాటిలో ఏదీ నిజం కాలేదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతాంగ సమస్యలు, మహిళల సమస్యలు అలాగే ఉన్నాయని, డ్వాక్రా సంఘాలకు కొనసాగుతున్న రాయితీలు, సబ్సిడీలను కూడా తొలగించారని భట్టి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
వృత్తులపై ఆధారపడ్డ బలహీనవర్గాల జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, వృత్తులకు సాంకేతికత జోడించేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ఫలితంగా వృత్తి పని చేసుకోలేక, ఉద్యోగాలు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారో అవేవీ నెరవేరడం లేదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తొమ్మిదేళ్ల రాబడి ఎటుపోయిందో తెలియదని, చివరకు రూ. 5 లక్షల కోట్లు అప్పు మాత్రం మిగిలిందని అన్నారు. ఈ అంశాలన్నీ సభలో లేవనెత్తుతామని అన్నారు.
విపత్తులు, వరదల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైందని భట్టి విక్రమార్క ఆరోపించారు. యంత్రాంగాన్ని ప్రభుత్వమే నిర్వీర్యం చేసి, స్తబ్దుగా మార్చేసిందని అన్నారు. పనిచేసే కొన్ని విభాగాలు బీఆర్ఎస్ సైనికులుగా మారిపోయారని విమర్శించారు. అందుకే వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నప్పటికీ.. ప్రజల్ని అప్రమత్తం చేయలేకపోయారని, ఫలితంగా మరణాలు, ఆస్తి నష్టం చోటుచేసుకుందని విమర్శించారు.
మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరుతున్నారని భట్టి తెలిపారు. బీఆర్ఎస్ సహా వివిధ పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం ఏమాత్రం లేదని, అందుకే నేతలు ఆయా పార్టీలు వీడి తమ దగ్గరకు వస్తున్నారని చెప్పారు. అయితే కొత్తగా చేరే నేతలకు సీట్లు, టికెట్ల హామీలు ఏమీ ఉండవని.. టికెట్ల కేటాయింపు పూర్తిగా శాస్త్రీయంగా సర్వేలు, అధ్యయనాలు చేసి అభ్యర్థి విజయావకాశాలను బేరీజు వేసుకుని అధిష్టానం నిర్ణయిస్తుందని భట్టి తెలిపారు.
పార్టీలో అనైక్యత ఏమీ లేదని, తమ పార్టీ వ్యక్తుల మీద కాదు, సిద్ధాంతం మీద నడిచే పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీ విలీనంపై విలేకరులు ప్రశ్నించగా.. వార్తల్లో కథనాల ద్వారా తనకు తెలిసిందని అన్నారు. పార్టీల విలీనం అంశం అధిష్టానం పరిధిలోని అంశం అని, అంతకు మించి తన వద్ద సమాచారం లేదని అన్నారు.