న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఓటమి భయంతోనే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ 115 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంపై స్పందిస్తూ.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరు చూస్తుంటే ‘ముందే కూసిన కోయిల’ అన్న చందంగా ఉందని అన్నారు.
సాధారణంగా ఎవరైనా ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారని, కానీ కేసీఆర్ తన పార్టీలోని అభ్యర్థులు ఎక్కడ చేజారిపోతారో అన్న భయంతో ముందే ప్రకటించి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. ‘స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్’ ఒకటి ఏర్పాటు చేసి, తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో విపరీతంగా నిధులు ఖర్చు పెట్టారని, అయినప్పటికీ సర్వే నివేదికలు చూస్తే తాను గెలిచే పరిస్థితి లేదని కేసీఆర్‌కు అర్థమైందని అన్నారు. అందుకే ముందు జాగ్రత్త కోసం మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారని సూత్రీకరించారు.
ఇప్పటి వరకు కేసీఆర్ బొమ్మ చూసి ప్రజలు ఓటేస్తే ఎవరైనా గెలుస్తారన్న నమ్మకం ఉండేదని, కానీ ఇప్పుడు కేసీఆర్‌కే తాను గెలుస్తానన్న నమ్మకం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆరే గెలవలేనప్పుడు ఆ పార్టీలో ఇతర నేతలు ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ నిత్యం సర్వేలు చేయించుకుంటూ.. ఆ ప్రకారం వ్యూహాలు రచిస్తూ ఉంటారని, వాటి ఆధారంగానే ఎక్కడ పోటీ చేయాలన్నది నిర్ణయించుకుంటారని భట్టి గుర్తుచేశారు. ఆయనే గెలవకపోతే ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరూ గెలవరని స్పష్టమవుతోంది అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఎప్పుడు ప్రకటిస్తుందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించామని, వాటి పరిశీలన ప్రక్రియ జరుగుతోందని అన్నారు. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత సమయానుకూలంగా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. అయితే కొద్ది నెలల క్రితం నుంచే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పూర్తి సిద్ధంగా ఉందని తెలిపారు.
తన పాదయాత్ర గురించి పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేకు వివరించానని, తదుపరి “సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్” కార్యక్రమం తలపెట్టామని భట్టి తెలిపారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి చేయలేదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆ కార్యక్రమంతో బదులిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూపిస్తూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని వెల్లడించారు.