న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గురువారం జరిగిన 74వ భారత గణతంత్ర ఉత్సవాల పరేడ్.. భారతదేశ శౌర్య, సాహసాలకు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు గర్వించేలా జరిగిన ఈ ఉత్సవాలల్లో.. ప్రధానిమోదీ సంకల్పించిన ఆత్మనిర్భర భారత్, నారీశక్తి సామర్థ్యం చాలా చక్కగా ప్రదర్శితమైందని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం ఎర్రకోట వద్ద ‘భారత్ పర్వ్’ కార్యక్రమాన్ని ఢంకా బజాయించి ప్రారంభించిన కిషన్ రెడ్డి, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ భారత్ పర్వ్ కార్యక్రమం ‘మినీ ఇండియా’ను తలపిస్తోందన్నారు.
వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను, కళలను, వివిధ రకాల వంటకాలను చూస్తుంటే.. యావద్భారతాన్ని ఒకేచోట చూసినట్లు అనిపిస్తోందన్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా భారత్ పర్వ్ కార్యక్రమం జరుపుకోలేకపోయామన్న కిషన్ రెడ్డి.. ఈసారి ఈ ఉత్సవాలను జరుపుకుంటుండటం, ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా భాగస్వాములు అవుతుండటం శుభపరిణామమన్నారు. భారత పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన అన్నారు.
గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ప్రదర్శించిన శకటాలన్నీ ఈ భారత్ పర్వ్ లో ప్రదర్శనకు పెట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రదర్శనను తిలకించేందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన అమృత్ కాల్ లక్ష్యాలను గుర్తుచేసిన కేంద్ర మంత్రి.. వచ్చే 25 ఏళ్లలో భారత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలను కూడా అనుసంధానించేందుకు రైలు, రోడ్డు, విమాన, టెలికాంతోపాటుగా సాంస్కృతిక అనుసంధానతకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, అదనపు కార్యదర్శులు రంజన్ చోప్రా, రాకేశ్ కుమార్ వర్మ, పర్యాటక శాఖ ఆర్థిక సలహాదారు జ్ఞాన్ భూషణ్ తో పాటు పర్యాటక శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక కళాకారులు, ఐహెచ్ఎం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.