హైదరాబాద్, ఆంధ్రప్రభ, మక్తల్ నుంచి ఆంధ్రప్రభ ప్రతినిధి: భారత్ జోడో యాత్రను ఏ శక్తీ అడ్డుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కలిసి మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలనలో పెరిగిపోయిన వైషమ్యాలు, హింసకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాలనే లక్ష్యంతోనే ‘నఫ్రత్ చోడో- భారత్ జోడో’ నినాదంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం రాయచూర్ నుంచి తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా మక్తల్ నియోజక వర్గంలోని కృష్ణానదీ మీదుగా గూడబెల్లూరు గ్రామానికి చేరుకున్నది.
రాష్ట్రంలోకి వచ్చిన రాహుల్‌కు, ఆయన బృందానికి టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మానిక్యం ఠాగూర్, వి. హనుమంతరావుతో పాటు పార్టీ సీనియర్లు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలికారు. కృష్ణానదీ బ్రిడ్జి నుంచి టైకేర్ జంక్షన్ వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేరక పాదయాత్ర చేపట్టారు. ఆశేషంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు , అభిమానుల హర్షద్వానాలు, టాపాసులు మోతల మధ్య టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంటా టైకేర్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్‌గాంధీ మాట్లాడారు.
దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి, సంరక్షించుకోవడానికే తాను భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నిర్వహిస్తున్నట్లు రాహుల్‌గాంధీ వివరించారు. మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని సంరక్షించుకోవడానికి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఈ యాత్ర కొనసాగుతోందన్నారు. దేశంలో నిత్యావసర వస్తువులతో పాటు, ఇంధన ధరలు కూడా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయని, ధరల నియంత్రణ కోసం కూడా ఈ యాత్ర కొనసాగుతోందని రాహుల్‌గాంధీ వెల్లడించారు. ప్రస్తుతం రెండు భారత్‌లున్నాయని, అందులో ఒకటి వేళ్ల మీద లెక్కపెట్టే ధనికుల భారత్ అయితే, రెండవది కోట్లాది మంది నిరుపేదల భారత్ అని ఆయన చెప్పారు. కానీ తాము మాత్రం ఒక్కటే భారత్ ఉండాలని కోరుకుంటున్నామని, అందరికి ఉపాధి, అందరికి సమ న్యాయం లభించాలని ఆకాంక్షింస్తున్నట్లు రాహుల్ స్పస్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సాగే భారత్ జోడో యాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ మద్దతు పలికి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దిపావళి శుభాకాంక్షలు తెలిపిన రాహుల్..
దేశ, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దిపావళి శుభాకాంక్షలు తెలిపారు. మొదటి రోజు పాదయాత్ర ముగిసిందని, దిపావళి సందర్భంగా మూడు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు, తిరిగి ఈ నెల 27న పాదయాత్ర ప్రారంభం అవుతుందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.