Friday, November 22, 2024

Big Story : హైద‌రాబాద్ సిటీలో భార‌త్‌ జోడోయాత్ర.. రేపు సౌత్ జోన్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ యువనేత రాహూల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర న‌వంబ‌ర్ 1వ తేదీన (మంగ‌ళ‌వారం) హైద‌రాబాద్ సిటీలోకి ప్రవేశించనుంది. మంగళవారం మధ్యాహ్నం వరకు శంషాబాద్‌ మీదుగా ఆరాంఘర్‌ చేరుకోనుంది. రాజేంద్రనగర్‌ నుంచి శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు కొనసాగనున్న యాత్రకు దారి పొడుగునా స్వాగతం పలికేందుకు నగర కాగ్రెస్‌ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సౌత్ జోన్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు పెట్టారు.

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: కాంగ్రెస్‌ పార్టీ యువనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నేడు నగరంలో ప్రవేశించనుంది. మంగళవారం మధ్యాహ్నం వరకు తొండుపల్లి, శంషాబాద్‌ మీదుగా ఆరాంఘర్‌ చేరుకోనుంది. రాజేంద్రనగర్‌, బహదూర్‌ పుర,చార్మినార్‌, గోషామహల్‌, నాంపల్లి, కూకట్‌ పల్లి, శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 45 కిలోమీటర్ల వరకు రెండు రోజుల పాటు సాగనుంది. మొదటి రోజు ఆరాంఘర్‌ నుంచి బ హదూర్‌ పూర,చార్మినార్‌, అఫ్జల్‌ గంజ్‌, మొజాంజాహి మార్కెట్‌, గాంధీభవన్‌ మీదుగా సాయాంత్రం నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటుంది.

విగ్రహానికి పూలమాళలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కాగ్రెస్‌ శ్రేణులతో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 3న ఉదయం ప్రారం భమయ్యే పాద యాత్ర బోయినపల్లి, బాలానగర్‌, మూసాపేట, కూకట్‌ పల్లి, మియాపూర్‌ వరకు సాగనుంది. జోడో యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర కాంగ్రెస్‌ పార్టీ యాత్ర సాగే దారి పొడుగునా ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్‌ నేతలు పోటాపోటీగా జెండాలు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు రాహూల్‌ దృష్టిలోపడేందుకు ఆశావాహులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పెద్దఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ కటౌట్లు కూడా ఏర్పాటు చేయడంతో యాత్ర జరిగే దారి పొడుగునా రోడ్డుకు రెండు వైపుల కాంగ్రెస్‌ జెండాలు దర్శనమిస్తున్నాయి. విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, ప్రజాస్వామిక వాదులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యోగులు, లౌకిక ప్రజాతంత్ర శక్తులందరూ పాల్గొనాలని కోరుతూ కాంగ్రెస్‌ శ్రేణులు వి స్తృత ప్రచారం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అన్ని స్థాయిల వారు పాల్గొంటున్న ఈ యాత్రను భారీ ఎత్తున సక్సెస్‌ చేసేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

మూడంచల భద్రతా..

- Advertisement -

రాహూల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు పోలీసులు మూడంచల భధ్రతను ఏర్పాటు చేయనున్నారు. పాస్‌లు ఉన్న వాళ్లు మాత్రమే ముడంచెల భద్రత వలయం ముందుకు సాగే అవకాశం ఉంది. ముందుగా స్థానిక పోలీసులతో రోప్‌ టీంతో భద్రత ఏర్పాటు చేశారు. రెండవ దశలో ఏసీపీ, సీఐలతో భద్రత కొనసాగుతోంది. రాహూల్‌గాంధీ చుట్టూరా ఎస్పీజీ, సీఆర్‌పీఎఫ్‌ భద్రత కొనసాగుతోంది. రాహూల్‌గాంధీ మాజీ ప్రధానుల వారసుడు, జాతీయ పార్టీ కీలక, ప్రతిపక్ష నాయకుడు కావడంతోకి భద్రత విషయంలో పోలీసులు ఆచి తూచి అడుగు వేస్తున్నారు. ముఖ్యమైన నేతలను మాత్రమే రాహూల్‌గాంధీ పక్కన కొనసాగించేందుకు అనుమతివ్వనున్నారు.

నగర కాంగ్రెస్‌లో ఉత్తేజం నింపేనా?

రాహూల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నేటి నుంచి రెండు రోజుల పాటు నగరంలో సాగనుంది. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులకు ఈ యాత్ర కోత్త ఉత్సాహం నింపుతుందా అని సగటు కాగ్రెస్‌ వాదిని వేధిస్తోంది. హైదరాబాద్‌ నగరంలో మొత్తం రెండు పార్లమెంట్‌ స్థానాలున్నాయి. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో 7, సికింద్రాబాద్‌లో పార్లమెంట్‌ స్థానంలో 8 శాసన సభ నియోజకవర్గాలున్నాయి. 15 నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో పార్టీని నిడిపించే బలమైన నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చాలా నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు ధీటుగా కార్యకర్తలు ఉన్నా తమను తాము కాపాడుకునేందుకు వారు ఇతర పార్టీల్లోకి వలస బాట పడుతున్నారు.

ఫలితంగా నగర కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారని స్వయంగా పార్టీ నేతలే బహిరంగంగా తమ ఆవేధనను వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత నగర కాంగ్రెస్‌ పార్టీలో కొంత ఉత్సాహ వాతావరణం ఏర్పడినప్పటికి అనుకున్న స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం వైపు అడుగులు పడటం లేదనే విమర్శలున్నాయి. రాహుల్‌ యాత్రతోనైనా నగర కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ జవసత్వాలు రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

నేటి నుంచి రెండు రోజుల పాటు సాగనున్న రాహుల్‌ జోడో యాత్రను పురస్కరించుకుని పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో రెండు రోజుల పాటు యాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. నవంబర్‌ 1న ఆరాంఘర్‌, బ హదూర్‌ పూర,చార్మినార్‌, అఫ్జల్‌ గంజ్‌, మొజాంజాహి మార్కెట్‌, గాంధీభవన్‌, నెక్లెస్‌ రోడ్‌ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు వరకు యాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్‌ను ఇతర ప్రాంతాలకు మళ్లించనున్నారు. నవంబర్‌ 2న సనత్‌ నగర్‌, బోయినపల్లి, బాలానగర్‌, మూసాపేట, కూకట్‌ పల్లి, మియాపూర్‌ వరకు ఉదయం 6గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆయా తేదీల్లో యాత్ర జరిగే మార్గంలో వాహనదారులు ట్రాఫిక్‌ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement