Friday, November 22, 2024

ఎల్‌ఏసీ సమీపంలో భారత్‌ హైడ్రో ప్రాజెక్టు.. అరుణాచల్‌లోని దిబాంగ్‌ వద్ద నిర్మాణం

దేశీయంగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడానికి పునరుత్పాదక ఉత్పత్తిని నిర్మించడానికి భారత్‌ ముందడుగేసింది. చైనా సరిహద్దుకు సమీపాన ఉన్న ఈశాన్య పర్వత సానువుల్లో అతిపెద్ద జల విద్యుత్‌ ప్రాజెక్టుకు సిద్ధమైంది. దిబాంగ్‌గా పేర్కొనే ఈ బహుళార్థక సాధక హైడ్రో ప్రాజెక్టును నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌పీసీ) నిర్మిస్తుంది. దీని నిర్మాణ వ్యయం సుమారు. 32 వేల కోట్ల రూపాయలు. 2,880 మెగావాట్ల దిబాంగ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిగువ దిబాంగ్‌ వ్యాలీ జిల్లాలో దిబాంగ్‌ నదిపై నిర్మించ బడుతుంది. తొమ్మిదేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 278 మీటర్ల ఎత్తయిన కాంక్రీట్‌ గ్రావిటీ డ్యామ్‌ 6వ నెంబర్‌ గుర్రపు డెక్క ఆకారంలో ఉంటుంది.

300 మీటర్ల నుంచి 600 మీటర్ల పొడవైన సొరంగాలను కలిగివుంటుంది. ఇందులో భూగర్భ పవర్‌ హౌస్‌ నిర్మిస్తారు. గుర్రపుడెక్క ఆకారంలో ఉండే టెయిల్‌రేస్‌ సొరంగాలు 9 మీటర్ల వ్యాసంతో 320 మీటర్ల నుంచి 470 మీటర్ల వరకు ఉంటాయి. ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యం వరద నియంత్రణ, నీటి నిల్వకు ఉద్దేశించినది. ఇది భారత దేశంలోనే ఎత్తయిన ప్రాజెక్టుగా నిలవనుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయంలో 12శాతం చెల్లిస్తుంది. ప్రాజెక్టులో భాగంగా, రూ.241 కోట్లు కమ్యూనిటీ, సామాజిక అభివృద్ధి ప్రణాళికకు ఖర్చు చేయనుండగా, రూ.327 లక్షలు స్థానిక ప్రజల సంస్కృతి పరిరక్షణ ప్రణాళికకు కేటాయిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement