న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలోని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కల్గిన ప్రదేశాలను అనుసంధానిస్తూ సాగే ప్రత్యేక పర్యాటక ‘భారత్ గౌరవ్’ రైలు తొలిసారిగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రయాణం ప్రారంభించనుంది. ఇప్పటికే 26 పర్యాటక రైళ్లు 22 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ ప్రయాణం సాగించగా.. శనివారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ‘పుణ్యక్షేత్ర యాత్ర – పూరి – కాశీ – అయోధ్య’ పేరుతో మరో భారత్ గౌరవ్ రైలు పరుగు ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్న మొట్టమొదటి భారత్ గౌరవ్ రైలు ఇదే కావడం గమనార్హం.
యాత్రలో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ అన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు రైలు ప్రయాణం సాగించనుంది. రాష్ట్రం నుంచి ప్రారంభమైన మొదటి రైలుకు ఊహించని రీతిలో స్పందన లభించిందని రైల్వే శాఖ ప్రకటించింది.
లగ్జరీ సదుపాయాలతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాత్రికుల ప్రత్యేక రైలులో ప్రయాణించేందుకు యాత్రికులు మొగ్గుచూపుతున్నారు. టూర్ ప్యాకేజిలో భాగంగా రైలు ప్రయాణం, బస, ఆయా పట్టణాల్లో సందర్శనకు ఏసీ బస్సుల సదుపాయం, భోజనం వంటి సదుపాయాలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అందజేస్తోంది.