హైదరాబాద్, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే నుండి తొలి భారత గౌరవ్ టూరిస్ట్ రైలు ఈనెల 18న ప్రారంభం కానుంది. దేశంలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలు, పుణ్య క్షేత్రాలను కలుపుతూ నిర్వహిస్తున్న ఈ రైలుకు పుణ్యక్షేత్ర యాత్ర : పూరీ-కాశీ, అయోధ్య యాత్రగా నామకరణం చేశారు. ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై రెండు తెలుగు రాష్ట్ర్రాలలోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ రైలుకు సంబంధించిన వివరాలను బుధవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుణ్యక్షేత్ర యాత్ర : పూరీ-కాశీ-అయోధ్య భారత్ గౌరవ్ పర్యటన ఈనెల 18న ప్రారంభమై 26 వరకు పూరీ,కోణార్క్,గయా,వారణాసి,అయోధ్య,ప్రయాగ్రాజ్ వంటి ప్రదేశాలను కవర్ చేస్తూ 8 రాత్రులు, 9 పగలు సాగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, విజయనగరం స్టేషన్లలో ప్రయాణికులు ప్రయాణించే అవకాశం కలిగించామన్నారు. ప్రయాణికులకు సరిపడు ఆహారం, వసతి, మొదలైన అన్ని రకాల వసతులతో కలిపి ఈ ప్యాకేజీ అందిస్తుందని చెప్పారు.
పూరీ జగన్నాథ దేవాలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయ విష్ణు పాద ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయం, అయోధ్య సరయు నది వద్ద రామజన్మభూమి, హనుమాన్గర్హితో హారతిని కూడా ప్రయాణికులు వీక్షించవచ్చన్నారు. అలాగే, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమాన మండపం ప్రయాణికులు వీక్షించవచ్చని ఈ సందర్భంగా ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.