న్యూఢిల్లి: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక రెండు రోజులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. సేవ్ పీపుల్, సేవ్ నేషన్ పేరుతో మార్చి 28,29న దేశవ్యాప్త బంద్ పాటిస్తామని తెలిపింది. కార్మికులు, రైతులు, సామాన్య ప్రజానీకాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర కార్మిక సంఘాలు, సెక్టోరల్ ఫెడరేషన్లు, సంఘాల వేదిక ఇటీవల ఢిల్లిలో సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలను నిరసించాలని తీర్మానించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్త బంద్ చేపట్టాలని ఆయా సంఘాలను కోరింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ముప్పు పొంచివున్నప్పటికీ రోడ్డు మార్గాలు, రవాణా కార్మికులు, విద్యుత్ కార్మికులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించు కున్నట్లు ప్రకటనలో తెలిపారు. 48 గంటల సమ్మె కారణంగా బ్యాంకులు, రైలేలు, విద్యుత్ సేవలపై ప్రభావం చూపనుందని ప్రభుత వర్గాలు అంచనా వేశాయి. ముఖ్యంగా విద్యుత్ నిర్వహణలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
సమ్మె ఎందుకంటే?
సంయుక్త కార్మిక సంఘం ప్రకటన ప్రకారం, కేంద్రంలోని బీజేపీ ప్రభుతం శ్రామిక ప్రజలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసింది. ఈపీఎఫ్ జమపై వడ్డీ రేటును 8.1శాతానికి తగ్గించడం, పెట్రోల్, ఎల్‌పీజీ, కిరోసిన్, సీఎన్‌జీ మొదలైన వాటి ధరలుపెంచడం, మానిటైజేషన్ ప్రోగ్రామ్ అమలుకు చర్యలను కేంద్రం చేపట్టింది. ప్రభుత విధాన నిర్ణయాలను కార్మిక సంయుక్త సంఘం సమావేశం తీవ్రంగా తప్పుబట్టింది. – కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ రాష్ట్రస్థాయిల్లోని వివిధ సంఘాలు సమ్మెలో పాల్గొనాలని కోరింది. బ్యాంకింగ్, బీమా సహా ఆర్థిక రంగాలు సమ్మెలో పాల్గొంటాయి. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపన్ను తదితర రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. రైల్వేలు, రక్షణరంగానికి చెందిన యూనియన్లు వందలాది ప్రదేశాలలో సమ్మెకు మద్దతుగా ఉద్యమించనున్నాయి. ఉమ్మడి కార్మిక సంఘంలో ఐఎన్‌టియూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సిఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యుఎ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్, యూటీయూసీ తదితర కార్మిక సంఘాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...