జీవితమంతా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతిని పురస్కరించుకొని పాత ఎంప్లాయ్ మెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న భాగ్యరెడ్డి వర్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ తో కలిసి పూలమాలలు వేసి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారి చూపిన ఉద్యమకారుడు, హక్కుల కార్యకర్త, దళిత పాఠశాలలు స్థాపించి బాల్య వివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించారన్నారు. అహింస సమాజం స్థాపించి సంఘ సంస్కరణలకు, దళితుల అభ్యున్నతికి గట్టి పునాది వేశారన్నారు. మద్యపాన నిషేధం, గ్రంథాలయాలు ఏర్పాటు వంటి కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఆయన జీవితాన్ని, సేవలను స్మరించుకుందామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ కుమార్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నేతినీయల్, దళిత నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement