చండీగఢ్ ఎయిర్‌పోర్టుకి భగత్‌సింగ్ పేరు పెడుతూ పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈమేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలాతో శనివారం సమావేశమైనట్లు చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్ పేరును చండీగఢ్ విమానాశ్రయానికి పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ‘చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ జీ పేరుతో మార్పు చేయాలని పంజాబ్, హర్యానా అంగీకరించాయి. ఈ అంశంపై ఇవాళ హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో సమావేశమయ్యాం’ అని అందులో పేర్కొన్నారు. ఈ సమావేశం ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.
కాగా, చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. 2016లో హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. మరోవైపు పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. భగత్ సింగ్ అమరుడైన మార్చి 23ను రాష్ట్ర సెలవుగా ప్రకటించింది. అలాగే సీఎం భగవంత్ మాన్ ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు.